Site icon vidhaatha

ధరణితో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం : కోదండరామ్‌

విధాత : గత ప్రభుత్వం ధరణితో, వీఆర్‌వోల రద్ధుతో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి భూ సమస్యలను మరింత జఠిలం చేసిందని టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ విమర్శించారు. ఆదివారం హైద్రాబాద్‌లో తెలంగాణ తహశీల్ధార్స్ అసొసియేషన్(టీజీటీఏ) ఆధ్వర్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గత పాలకులు తమ అక్రమాలకు అడ్డుపడుతారనుకున్న వారిని అడ్డం తొలగించి భూ రికార్డులను ఇష్టానుసరంగా మార్చుకుని, పాలకులే భూదందాలకు పాల్పడ్డారన్నారు. తహశీల్దార్లను స్టాంప్స్ వేయడానికే పరిమితం చేశారన్నారు. న్యాయ రక్షకులే న్యాయాన్ని దుర్వినియోగం చేస్తే అది ధరణి పోర్టల్ అవుతుందని విమర్శించారు.


వ్యక్తి హక్కులు గ్యారంటీగా ఉండాలన్నారు. రెవెన్యూ వ్యవస్థ గ్రామ స్థాయి దాకా ఉండాలని వీరప్ప మొయిలీ కమిటీ సూచనలు చేసిందని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం మంచి కమిటీ వేసి సూచనలు తీసుకోవాలని సూచించారు. రికార్డులు లేకుండా విధ్వంసం చేశారని, చట్టాలను వారికి అనుకూలంగా ఎలా మార్చుకున్నారో కూడా ప్రజలకు వివరించాలన్నారు. అధికారులు పాలకుల కోసం పని చేయొద్దని, చట్టాల ప్రకారం చేయాలని అధికారులను కోరారు. ఈ పదేండ్లల్లో ఎంతటి విధ్వంసం జరిగిందో పుస్తకం రాసి ప్రచారం చేయాలన్నారు.

తెలంగాణ విధ్వంసం : రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి

తెలంగాణను అన్ని రంగాల్లో విధ్వసం చేసిన కేసీఆర్ ఉద్యమకారుడు కాదని, విధ్వంసకారుడని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరులను దోచుకోవడంతోనే రాష్ట్రం అప్పుల పాలైనా, అందుకు తగ్గట్లుగా అభివృద్ధిని సాధించలేదన్నారు. మన కంటే అతి తక్కువ జనాభా, వనరులు కలిగిన చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. గత ప్రభుత్వ అక్రమాలు, అవినీతిల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కూడా భాగస్వామ్యం చేశారన్నారు. అందుకే ఒక ఐఏఎస్ తాను అవినీతి పరుడనైతే తమకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పోస్టు వచ్చేదని అభిప్రాయపడ్డారని తెలిపారు. అవినీతి అనే పదం వాడటానికి కేసీఆర్ కుటుంబానికి అర్హత లేదన్నారు. ప్రతి కలెక్టర్, తహశీల్దార్, ఉద్యోగులంతా తెలంగాణ నాది, పనిచేసే జిల్లా, మండలం నాది అన్నభావనతో ఉన్నప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యమవుతుందన్నారు.

భూ సమస్యల సాధనే ప్రగతికి సోపానం : భూమి సునీల్‌

భూ సమస్యల సాధనతోనే సామాజిక, ఆర్ధికాభివృద్ధికి బాటలు పడుతాయని భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ అభిప్రాయపడ్డారు. భూమి చిక్కులు లేని దేశమే అభివృద్ధి చెందుతుందని, ఇందుకు అభివృద్ధి చెందిన దేశాలే నిదర్శనమన్నారు. భూ సమస్యలు తీర్చకుండా సామాజిక, బంగారు తెలంగాణను సాధించలేమన్నారు. ఏ రంగంలో పురోగమించాలన్న ముందుగా భూమి సమస్యల్లేకుండా చేయాలన్నారు. అన్ని దేశాలు, రాష్ట్రాలు భూమికి టైటిల్ గ్యారంటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు.. మనం ఎక్కడ ఉన్నామో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. భూ యజమాని కోరుకునేది కేవలం తన భూమి హద్దులు, రికార్డులు స్పష్టంగా, భద్రంగా ఉండాలని, హక్కుల మార్పిడి వెంటనే జరగాలని మాత్రమేనన్నారు. భూ సమస్యల్లో ఏవైనా చిక్కులు వస్తే గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. ఈ నాలుగు పనులు చేస్తే సమాజం అభివృద్ధి దిశగా పురోగమిస్తుందని, అందులో రాష్ట్రం ఎక్కడుందో ఆలోచించుకోవాలన్నారు. 2025 వరకు దేశంలో భూ పరిపాలన ఎలా ఉండాలన్న రూట్ మ్యాప్ ఉందన్నారు. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి భూ కమతానికి ఒక గుర్తింపు నంబరు ఉండాలని, అన్ని రాష్ట్రాల్లో కాగితాల్లోని భూ రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండాలని,. మిర్రర్ ప్రిన్సిపల్‌గా ఉండాలని చెబుతుందన్నారు. అయితే కాగితాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, కానీ హక్కుల రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రెవెన్యూ శాఖ ఇచ్చే కాగితానికి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని అమలు చేస్తున్నారని, ప్రతి గ్రామంలో 6 నుంచి 8 మంది భూ పరిపాలనకు అధికారులు ఉన్నారని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచైనా చేసే వెసులుబాటు కల్పిస్తున్నారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం అక్టోబరు 30న అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వంలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుందన్నారు. రెవెన్యూ అకాడమిని పెట్టాలని, దాని ద్వారా రెవెన్యూ చట్టాలపై శిక్షణ ఇవ్వొచ్చునన్నారు.

కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు : జీటీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి

సదస్సుకు అధ్యక్షత వహించిన టీజీటీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కొత్త ప్రభుత్వంపై పాలన మార్పులపైన ప్రజలు, ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ సమస్యల పరిష్కరం దిశగా అడుగులు వేస్తుందని, భూ సమస్యల సమగ్ర అధ్యయనానికి, రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి త్వరలోనే ఓ కమిటీ వేయబోతుండటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అవలంభించిన విధానాలతో రెవెన్యూ శాఖ నిర్వీర్యమైందని, క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేక రైతులకు, ప్రజలకు రెవెన్యూ సేవలు దూరమయ్యాయని అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె. రామకృష్ణ, ఎస్ఆర్ సరిత, మాజీ అధ్యక్షుడు కె. లక్ష్మయ్య, తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ కరుణాకర్ దేశాయ్, వీఆర్ఎ, వీఆర్వో సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version