Site icon vidhaatha

తండ్రి పితలాటకం.. కొడుక్కి ఇరకాటం! ‘వసంత’ కెరీర్‌కు చిక్కులు

విధాత‌: మనసులో ఎన్నాళ్ల నుంచో గూడు కట్టుకున్న భావాలు అలా కుల సంఘం సమావేశంలో తన్నుకొచ్చాయో.. లేదా చాదస్తంతో అనేశారో గానీ కృష్ణా జిల్లా నేత వసంత నాగేశ్వరరావు చేసిన పొలిటికల్ కామెంట్లు ఆయన కొడుకు వసంత కృష్ణ ప్రసాద్ కెరీర్‌కు అడ్డంకులు కలిగించేలా ఉన్నాయి.

ఎన్టీఆర్ జమానాలో హోంమంత్రిగా కూడా చేసిన వసంత నాగేశ్వరరావు మొన్నామధ్య కమ్మ సంఘం సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కమ్మలకు.. కమ్మ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం లేదని.. ఒక్క కమ్మ ఎమ్మెల్యేకూ మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. ఆయన అన్నది వాస్తవమే అయినా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేస్తూ ఇలా కామెంట్లు చేయడం సంచలనం రేపాయి.

వాస్తవానికి ఆయన కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూనే 2019 ఎన్నికల ముందు కొడుకు కృష్ణ ప్రసాద్‌తో బాటు వైసీపీలో చేరారు. ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్‌కి మైలవరం టికెట్‌ని జగన్ కేటాయిస్తే నాటి టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద మంచి మెజారిటీతో గెలిచారు. ఇక ఆ జిల్లా నుంచి తొలి విడత మంత్రివర్గంలో కొడాలి నాని మంత్రి అయ్యారు.

ఇక రెండవ విడతలో తనకు చాన్స్ వస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ ఆశించారు. కానీ ఆయనకు పదవి దక్కలేదు. సీనియర్ నేతగా వసంత నాగేశ్వరరావు తన ఆవేశాన్ని ఆవేదనను తమ సామాజికవర్గం కార్తీక సమారాధన చేస్తే అందులో వెళ్ల‌గ‌క్కారు. ఆ మర్నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిగా అమరావతి బెటర్ అన్నారు. ఇలా ఆయన తన మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుంటూ జగన్ను రెచ్చగొట్టేలా మాట్లాడేశారు. ఈ కామెంట్ల పట్ల వైసీపీ అధినాయకత్వం గుర్రుగా ఉంద‌ని స‌మాచారం.

తండ్రి వసంత మాటలతో తనకు సంబంధం లేదని తాను వైసీపీకి వీర విధేయుడిని అని కృష్ణ ప్రసాద్ ప్రకటించుకున్నా కూడా పార్టీ పెద్దల్లో కాస్త అసంతృప్తికి ఈయన కారణం అయ్యారని అంటున్నారు. వచ్చే ఎన్నకల్లో ఆయనకు టికెట్ ఇస్తారో లేదోనన్న పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. మొత్తానికి తండ్రి నోటి దురుసు కొడుకు పొలిటికల్ కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసిందని అంద‌రూ అంటున్నారు.

Exit mobile version