Site icon vidhaatha

Congress | కాంగ్రెస్‌లో వర్గ పోరు.. టికెట్లకు ముందే నేతల మాటల యుద్ధం

Congress | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లో వర్గ పోరు రచ్చకెక్కింది. పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్ట్ రాక ముందే నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభలు, సమావేశలు రసాభాసగా మారుతున్నాయి. నిన్న మొన్న పార్టీ లో చేరిన నాయకులకు టికెట్ ఎలా ఇస్తారని సీనియర్ నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంత కాలం పార్టీని అంటిపెట్టుకుని ఉండి నియోజకవర్గంలో పర్యటనలు చేసి కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తుంటే ఎన్నికల సమయంలో మమ్మల్ని విస్మరించి జూనియర్ నాయకులకు టికెట్ ఇస్తే పార్టీ కి మనుగడ ఉండదని సీనియర్ నాయకులు అంటున్నారు.

మొదటి లిస్ట్ లో సీనియర్లకు టికెట్ ఇవ్వకుంటే పార్టీని వీడెందుకు వెనుకాడమని కాంగ్రెస్ అధిష్టానంకు అల్టిమేటం ఇస్తున్నారు. ఈ మధ్య నాగర్ కర్నూల్ నియోజకవర్గం బీఆరెస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అక్కడి సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డికి మింగుడుపడడం లేదు. ఇక్కడి కాంగ్రెస్ టికెట్ రాజేష్ రెడ్డి కి ఇప్పించేందుకు ఆయన తండ్రి దామోదర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కుమారుడికి టికెట్ హామీ తీసుకున్నాకే పార్టీ లో చేరారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నియోజకవర్గంలో కూచుకుళ్ళ ప్రచారం కూడా మొదలుపెట్టారు.

దీంతో టికెట్ వచ్చే పరిస్థితి లేదని భావించిన నాగం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై మండిపడుతున్నారు. కొత్తగా పార్టీ లోకి వచ్చిన కూచుకుళ్ళ కుమారుడికి టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఈ మధ్య పార్టీ లోకి వచ్చి ఇతర నియోజకవర్గాల్లో తన వర్గానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎటువైపు పోతుందో తెలియడం లేదని నాగం విమర్శలు చేస్తున్నారు. బీఆరెస్‌ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ బీఆరెస్‌కు వెళ్లరనే గ్యారంటీ ఏమిటని నాగం ప్రశిస్తున్నారు.

కూచుకుళ్ళ, జూపల్లిలు గులాబీ గూటి పక్షులే అని, వీరు ఎన్నికల తరువాత మళ్ళీ అదే పార్టీ లోకి వెళతారని, వీరిని నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ అధిష్టానంకు నాగం హెచ్చరించారు.నాగర్ కర్నూల్ లో నాగంకు టికెట్ రాకుంటే ఆయన మరో పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ తీరును ఎండ గడుతున్న నాగంకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ నేత నాగం భవిష్యత్ ఏంటో కొద్దీ రోజుల్లో తేలిపోనుంది.

నియోజవర్గాల్లో వర్గపోరు

కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఇక్కడి కాంగ్రెస్ సీనియర్ నేత చింతపల్లి జగదీశ్వర్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జూపల్లికే టికెట్ వస్తుందని నియోజకవర్గంలో ఊహాగానాలు వినిపిస్తుండడంతో చింతపల్లి వర్గం పార్టీ అధిష్టానం పై మండిపడుతున్నారు. జూపల్లికి టికెట్ ఇవ్వొద్దని పార్టీ ని హెచ్చరిస్తున్నారు. బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్ లోకి కొత్తగా వచ్చిన వారిని నమ్మితే వారు పార్టీని నట్టేట ముంచుతారని జగదీశ్వర్ రావు వర్గం అంటున్నారు.

ఇక్కడ ఇలా ఉంటే గద్వాల నియోజకవర్గంలో వర్గ పోరు ఉండదని పార్టీ లో చేరిన బీఆరెస్‌ జడ్పీ చైర్ పర్సన్ సరితకు కొత్తగా అసమ్మతి పుట్టుకొచ్చింది. ఆమె సామాజిక వర్గం నుంచే కురువ విజయకుమార్ ఆమె రాకను తేవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ని నమ్ముకొని ఇంతకాలం ఉన్న తమలాంటి సీనియర్ల ను విడిచిపెట్టి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే సహించేది లేదని పార్టీని హెచ్చరించారు. మొదటి లిస్ట్ లోనే సరిత పేరు ఉన్నట్లు నియోజకవర్గంలో చర్చకు వచ్చింది.

దీంతో సీనియర్ నాయకులు స్పందించి సరితకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత అనిరుద్ రెడ్డికి ఎదురు లేదని, పార్టీ టికెట్ తనకే వస్తుoదని అనుకున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (చంద్ర శేఖర్ ) కాంగ్రెస్ లోకి ఎంటర్ అయ్యారు. జడ్చర్ల నియోజకవర్గం టికెట్ ఎర్ర శేఖర్ కే వచ్చిందని, మొదటి లిస్టులోనే ఉందన్న ప్రచారం ఇక్కడ హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయం బయటికి రావడంతో అనిరుద్ రెడ్డి ఖంగుతిన్నారు.

ఇంత కాలం పార్టీని నమ్ముకుని నెల రోజుల నుంచి నియోజకవర్గం లోని గ్రామాల్లో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసు కుంటున్నారు. టికెట్ తనకే వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు టికెట్ రాని పరిస్థితి వస్తే అనిరుద్ రెడ్డి పార్టీని వీడే పరిస్థితి వస్తున్నదా లేక ఎర్ర శేఖర్‌కు మద్దతుగా నిలబడతారా అనే ప్రశ్నలకు త్వరలో జవాబు దొరుకుతుంది. వనపర్తి నియోజకవర్గంలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. ఇక్కడి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి కి వర్గ పోరు తప్పడం లేదు. కాంగ్రెస్ యువజన నేత శివసేనరెడ్డి పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విషయం ప్రకటించడంతో చిన్నారెడ్డి వర్గం నాయకులు ఆయనపై మండిపడ్డారు. గొడవ పెద్దగా కావడంతో సమావేశం నుంచి వెళ్లి పోయారు. మరో నేత పెద్దమందడి బీఆరెస్‌ ఎంపీపీ మెగా రెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి చెందిన మెగారెడ్డి వనపర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఈయన కూడా కాంగ్రెస్ సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. పొంగులేటి మద్దతు తనకు ఉందని టికెట్ తప్పకుండా తనకే వస్తుందని చెప్పడంతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయన పై మండిపడ్డారు.

ఇదంతా గమనిస్తే మాజీ మంత్రి చిన్నా రెడ్డికి వర్గ పోరు తప్పేటట్లు లేదు. వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ అధిగమించి ఎలా ముందుకు వెళతారో వేచిచూడాలి. మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా వర్గపోరు కనిపించడం లేదు. కానీ మొదటి లిస్టులో మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట నియోజకవర్గాల ప్రస్తావన లేనట్లు తెలుస్తోంది. ఇక్కడ సర్వేల ద్వారా అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వర్గ పోరు తప్పదన్న ఆందోళన పార్టీ కేడర్‌లో వినిపిస్తుంది.

Exit mobile version