విధాత: ఆకలి సూచీలో భారత్ మరింత దిగజారింది. అట్టడుగు స్థానానికి చేరింది. 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరింది. ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంక 64వ స్థానంలో ఉంది. ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్ 99వ స్థానంలో ఉంది. ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్తాన్ కూడా మనకంటే మెరుగైన స్థానాల్లో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది.
దీంతో కేంద్రంపై ప్రతిపక్షాల నాయకులు మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. 121 దేశాలతో విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ 107వ స్థానంలో ఉంది. శ్రీలంక (64వ ర్యాంక్), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99) మన దేశం కన్నా ముందున్నాయి.
దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ (109 ర్యాంక్) మాత్రమే భారత్ కన్నా దిగువన ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వార్షిక నివేదికను కన్‌సర్న్ హంగర్, వెల్తుంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి. అయితే గతేడాది 116 దేశాల్లో భారత్ 101వ స్థానంలో నిలిచింది. నాడే ఆ నివేదికను కేంద్రం తప్పు బట్టింది. ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉందంటూ కేంద్రం ఆ నివేదికను తప్పుబట్టింది.
ఎన్డీఏ గవర్నమెంట్ సాధించిన మరో అద్భుతమైన విజయం ఇది అంటూ కేటీఆర్ ఈ సందర్భంగా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరడం దారుణమన్నారు. ఈ ఫెయిల్యూర్‌ను బీజేపీ జోకర్స్ అంగీకరించకుండా.. భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టి పారేస్తారని తాను అనుకుంటున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత చిదంబరం కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘోరమైన ర్యాంక్‌కు బీజేపీ ప్రభుత్వమే కారణమని విరుచుకుపడ్డారు. దేశంలోని చిన్నారుల్లో కనిపిస్తున్న పోషకాహార లోపం, ఆకలి, ఎదుగుదల వంటి అంశాలపై మోదీ ఎప్పుడు ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. దేశంలో 22.4 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారని గుర్తు చేశారు. ఆకలి సూచీలో భారత్ దాదాపుగా అట్టడుగు స్థానానికి చేరుకోవడం దారుణమన్నారు.