Site icon vidhaatha

Inheritance | కుటుంబం.. రాజకీయం! ఆర్థిక బలం ఆలంబనగా వారసత్వం

Inheritance |

గతంలో ఉద్యమాలు చేసి, ప్రజల మధ్య గడిపి, ప్రజల మద్దతు పొంది నాయకులుగా ఎదిగేవారు! ఆ ఎదుగుదలే వారు కీలక పదవులు చేపట్టేందుకు అవకాశం ఇచ్చింది. అందుకే అనేక మంది జనంలోంచి వచ్చిన జన నేతలుగా కీర్తనలు పొందారు. కానీ.. ఇప్పుడు ఉద్యమాల్లో తిరగాల్సిన పనిలేదు. ప్రజా సమస్యలపై జరిగిన ఆందోళనల్లో లాఠీ దెబ్బలు తినాల్సిన అవసరమూ లేదు! రాజకీయ కుటుంబ వారసత్వం, ఆర్థిక దన్ను, నిత్యం చుట్టూ తిరిగే ఓ పాతికమంది అనుయాయులు! వీరు చాలు.. ఏ అనుభవం లేకపోయినా నాయకుడైపోయేందుకు అన్నట్టు పరిస్థితి తయారైంది. నాయకులు కూడా మేం చేసిన సేవ ఇక చాలు.. మా బదులు వారసులు సేవ చేస్తారంటూ వారికి టికెట్లు కోరుతుండటం విచిత్రంగా కనిపిస్తున్నది! కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ నీతులు పలికే బీజేపీలోనూ ఈ సంస్కృతి కనిపిస్తుండటం విడ్డూరమే!

విధాత: ఆర్థిక బలం రాజకీయ వారసత్వాలకు ఆలంబనగా నిలుస్తుంది. ఒకరకంగా కలిమి, రాజకీయ బలిమి రెండు పరస్పర ఆధారిత చోదకాలే. దేశ రాజకీయాలలో గాంధీ కుటుంబ వారసత్వం బలమైన ముద్ర వేస్తే ప్రాంతీయ పార్టీల జోరుతో వారసత్వ కుటుంబ రాజకీయాలు రాష్ట్రాలలో మరింత బలోపేతమయ్యాయి. ఇప్పుడీ సంస్కృతి నియోజకవర్గాలలోకి కూడా విస్తరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకే కుటుంబంలో పలువురు టికెట్లు కోరుతుండటం.. సీనియర్లు తప్పుకొని తమ వారసులకు టికెట్లు ఆడగటం చర్చనీయాంశమైంది.

అధికార బీఆరెస్.. రాష్ట్ర రాజకీయాలలో కుటుంబ పార్టీ అనే ముద్రను అధికారికంగానే కొనసాగిస్తుండటం అందరికీ తెలిసిందే. ‘నేను, మా ముసలావిడ తప్ప మాకెవరూ లేరు.. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యం’ అన్న బీఆరెస్ అధినేత రాష్ట్ర సాధన లక్ష్యానికి చేరువైన కొద్దీ తన కుటుంబ సభ్యులను చేరదీయడమే కాకుండా.. అధికారంలోకి వచ్చాక వారికి కీలక పదవులిచ్చి అధికార కేంద్ర స్థానాలుగా మార్చేశారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు కూడా తమ కుటుంబ సభ్యులకు, వారసులకు టికెట్లు అడగటం మొదలైంది. కాంగ్రెస్‌లో మొదటి నుంచీ వారసత్వ, కుటుంబ రాజకీయాల ప్రభావం అధికంగానే ఉంది. కొత్తగా ఈ సంస్కృతి బీజేపీలో కూడా విస్తరిస్తున్నది.

బీఆరెస్‌లో వారసత్వ టికెట్లు

బీఆరెస్‌లో పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌ సంగతి పక్కనపెడితే.. మిగిలిన నాయకుల నుంచి కూడా ఈ దఫా వారసులకు గణనీయ సంఖ్యలోనే టికెట్ల డిమాండ్ వినిపించిం ది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తాము రిటైర్మెంట్ తీసుకుంటామ ని, తమ కుమారులకు టికెట్లు ఇవ్వాలని కోరగా కేసీఆర్ బాన్స్‌వాడలో మళ్లీ పోచారంకే టికెట్ ఇచ్చారు. గుత్తా వారుసుడైన అమిత్‌రెడ్డికి టికెట్ నిరాకరించినా ఎంపీ టికెట్ ఇచ్చే చాన్స్ లేకపోలేదు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనకు బదులుగా తన కుమారుడైన సంజయ్‌కు టికెట్ కోరగా కేసీఆర్ అలాగే చేశారు.

అలాగే సానుభూతి కోణంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు జీ లాస్య నందితకు టికెట్ కేటాయించారు. మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజిగిరి టికెట్ ఇవ్వగా, ఆయన తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వనందుకు తిరుగుబాటు చేశారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి టికెట్‌ను ఈ దఫా కాంగ్రెస్ నుంచి వచ్చిన పైలట్ రోహిత్‌రెడ్డి ఎగురేసుకు పోగా, మహేందర్‌ రెడ్డికి మంత్రి పదవితో ఊరట లభించింది. అయితే ఆయన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డికి మరోసారి కొడంగల్ టికెట్ దక్కింది. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి తమ తమ కుమారులకు టికెట్ ఆశించినప్పటికీ వారి ప్రయత్నం ఫలించలేదు.

నాగార్జున సాగర్‌లో మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకాల మృతితో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్‌కు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న కేసీఆర్.. మరోసారి ఆయనకే సిటింగ్ కోటాలో ఇచ్చేశారు. అయితే దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి ఈ దఫా టికెట్ నిరాకరించారు.

గత ఎంపీ ఎన్నికల్లో వారసత్వ కోణంలోనే గుగులోతు కవితకు టికెట్ ఇచ్చారు. రానున్న ఎంపీ ఎన్నికల్లోనూ మరికొందరు వారసులు టికెట్ల రేసులోకి రావచ్చు. కాగా మంతి నిరంజన్‌రెడ్డి తన అల్లుడు ప్రమోద్‌ కుమార్‌రెడ్డిని నియోజకవర్గ ఇంచార్జ్‌ చేశారు. మాజీ ఎంపీ మంద జగన్నాథం తన కుమారుడు శ్రీనాథ్‌ను క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా నడిపిస్తున్నారు.

కాంగ్రెస్‌లోనూ వారసత్వ టికెట్ల లొల్లి

కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఈ దఫా కుటుంబ, వారసత్వ టికెట్ల పంచాయతీ జోరుగానే సాగుతున్నది. సీనియర్ నేత, ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి మరోసారి హుజూర్‌నగర్‌, కోదాడ టికెట్లకు దరఖాస్తులు చేసుకున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ల కేటాయింపుపై పార్టీ ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌, బీసీలకు టికెట్ల అంశాన్ని ముడిపెడుతూ కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం సాగుతున్నది. నాగార్జున సాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గాలలో సీనియర్ నేత, మాజీ మంత్రి కే జానారెడ్డి తనయులు రఘువీర్‌, జయవీర్‌రెడ్డి దరఖాస్తులు చేశారు.

సనత్‌నగర్‌లో మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి, ఖైరతాబాద్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి దరఖాస్తు చేశారు. కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ టికెట్ కోసం ఆజారుద్దీన్‌తో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరబోతున్న ఖానాపూర్ సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ అసిఫాబాద్ నుంచి, రేఖానాయక్ ఖానాపూర్ నుంచి దరఖాస్తులు చేసుకున్నారు.

మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, కుమార్తె త్రిష అందోల్‌ సీటు కోసం దరఖాస్తు చేశారు. మాజీ ఎంపీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, కుమారుడు అనిల్‌కుమార్‌ ముషీరాబాద్ టికెట్ రేసులో ఉన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగుకు, ఆమె కుమారుడు సూర్యం పినపాక టికెట్ కోసం దరఖాస్తు చేశారు.

కరీంనగర్ సీటుకు సీఎం కేసీఆర్ అన్నకూతురు రమ్యారావు, కుమారుడు రితేశ్‌రావు దరఖాస్తు చేశారు. మాజీ ఎంపీ బలరాంనాయక్ కుమారుడు సాయి శంకర్‌కు టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ ఈస్ట్ నుండి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ పరకాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు.

బీఆరెస్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి నాగర్ కర్నూల్ టికెట్‌కు దరఖాస్తు చేశారు. మునుగోడులో మరోసారి రాజ్యసభ దివంగత సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతి, బెల్లంపల్లిలో దివంగత మాజీ మంత్రి కే వెంకటస్వామి కొడుకు గడ్డం వినోద్‌, నిజామాబాద్ అర్బన్‌లో మాజీ మంత్రి, డీ శ్రీనివాస్ కొడుకు ధర్మపురి సంజయ్‌ దరఖాస్తు చేశారు.

అశ్వారావు పేటలో మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన మనుమరాలు వగ్గెల పూజ, పినపాకలో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య కొడుకు సంతోష్‌, బోధన్‌లో మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి అల్లుడు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, బాన్సువాడలలో దరఖాస్తు చేశారు.

మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కొడుకు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, దేవరకద్రలో మాజీ ఎమ్మెల్యే కేకే రెడ్డి మనుమడు అరవిందకుమార్‌రెడ్డి, మంచిర్యాలలో దివంగత మాజీ ఎమ్మెల్యే కే రమణయ్య కుమారుడు కేవీ ప్రతాప్‌, అసిఫాబాద్‌లో మాజీ మంత్రి కొట్నాక్ భీంరావు కూతురు మర్సుకోల సరస్వతి కాంగ్రెస్ టికెట్ల రేసులో ఉన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తన కొడుకు శశిథర్‌రెడ్డిని, మాజీ మంత్రి చిన్నారెడ్డి తన కుమారుడు ఆదిత్యారెడ్డిని, జూపల్లి కృష్ణారావు కొడుకు అరుణ్‌ను అవకాశం దక్కితే ఎన్నికల బరిలోకి దించేందుకు సిద్ధం చేస్తున్నారు.

బీజేపీలోనూ వారసత్వ వాసనలు

గతానికి భిన్నంగా బీజేపీలోనూ ఇటీవల వారసత్వ రాజకీయాలు పెరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈ జాబితా పెద్దగానే ఉన్నా తెలంగాణలో తక్కువగానే ఉంది. తాజాగా వేములవాడ బీజేపీ టికెట్ కోసం మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ కుమారుడు వికాస్‌రావు రంగప్రవేశం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ తన కూతురు స్నిగ్ధారెడ్డిని, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావు తన కొడుకు వరుణ్‌రావును ఎన్నికల రేసులోకి తెస్తున్నారు.

Exit mobile version