- మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతిని నిరూపిస్తాం
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పసుపు పంటకు రూ.12000 మద్దతు ధర
- డబుల్ ఇండ్లు సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్లలకేనా.. ఓట్లు వేసిన ప్రజలకు ఇవ్వరా
- హాత్ సే హాత్ జోడోయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత: తెలంగాణ అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణ కాంట్రాక్టులపై విచారణకు ఆదేశిస్తే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అవినీతిని నిరూపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా బాల్కొండ నియోజక వర్గంలోని ఏరట్లలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ఈ వేదిక సాక్షిగా ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.. 2018లో రూ. 62 కోట్లతో అమరవీరుల స్థూపం కడతామన్నారు. కానీ ఈ ఐదేళ్లలో బడ్జెట్ రూ.200 కోట్లకు పెరిగిందన్నారు. ఇందులో రూ.50 కోట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. అమరవీరుల స్థూపం కాంట్రాక్టర్, వాచ్ మెన్ అందరూ ఆంధ్రావాళ్లే నన్నారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం కాంట్రాక్టులపై విచారణకు ఆదేశించండి.. మంత్రి ప్రశాంత్ రెడ్డి అవినీతిని నిరూపిస్తామని రేవంత్ అన్నారు.
మీకు ఓట్లు వేసిన ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లేవి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేవలం మూడు నియోజకవర్గాలకేనా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వెల్, మీ కొడుకు మంత్రి కేటీఆర్ నియోజక వర్గమైన సిరిసిల్ల, మీ మేనల్లుడి నియెజకవర్గమైన సిద్దిపేటలకు మాత్రమే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇచ్చారు కానీ, మీకు ఓట్లు వేసిన ఇక్కడి ప్రజలకు డబుల్ ఇల్లు ఎందుకు ఇవ్వరన్నారు.
ఓట్లు వేసిన ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వని దద్దమ్మ మంత్రి ప్రశాంత్ రెడ్డి అని అన్నారు. ఇంత అధ్వాన్నమైన రోడ్లు నేను ఎక్కడా చూడలేదన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయని ఈయనేం మంత్రి అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని నిలదీశారు.
సమావేశానికి రావద్దని రైతులను బెదిరించిన బీఆర్ఎస్ సన్నాసులు
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతులతో సమావేశానికి రావద్దని బీఆరెస్ సన్నాసులు బెదిరించారట, పోలీసులకు చెప్పి కేసులు పెడతామని రైతులను భయపెట్టారట, అయినా భయపడకుండా రైతులు సమావేశానికి హాజరయ్యారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇక్కడి రైతులు హర్యానా రైతుల స్పూర్తితో పోరాడి హక్కులు సాధించుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చెరుకు పరిశ్రమలు నడిపించారని, కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇక్కడి చక్కెర పరిశ్రమను మూసేశారన్నారు.
మాట తప్పిన అరవింద్‌ను పొలిమేరలకు తరమాలి
పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ ఇచ్చి మాట తప్పిన అరవింద్‌ను పొలిమేరలకు తరమాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి రైతులకు పిలుపు ఇచ్చారు. పసుపు బోర్డు తెస్తానన్న అరవింద్ ఇక్కడి రైతులను మోసం చేశారన్నారు.
కల్వకుంట్ల కుటుంబాన్ని పాతరేసిన చరిత్ర ఈ ప్రాంతానిది
కవితను ఓడించి కల్వకుంట్ల కుటుంబాన్ని పాతరేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని రేవంత్ అన్నారు. కేసీఆర్ కట్టు బానిస ఇక్కడి యువతకు గంజాయి అలవాటు చేస్తుండని ఆరోపించాడు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నారన్నారు.
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
2024 నుంచి 2034 వరకు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే డైరీ రాసి పెట్టండి.. అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిద్దామన్నారు. ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ కు ఎక్కువ ఎంపీటీసీకి తక్కువ అని ఎద్దేవా చేశారు.
ఆత్మగౌరవానికి ప్రతీకలైన నిజామాబాద్ ప్రజలు ఇలాంటి వారిని (ఇక్కడ ప్రశాంత్ రెడ్డి, అక్కడ జీవన్ రెడ్డి) ఎన్నుకుంటారా? అని రేవంత్ అడిగాడు. వీరిని ఓడించి మీ ఆత్మగౌరవం మీరు కాపాడుకోండని ప్రజలను కోరాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పసుపు పంటకు రూ.12000 మద్దతు ధర కల్పిస్తామన్నారు.
అలాగే ఎర్ర జొన్నలకు రూ.4000, మొక్క జొన్నలకు రూ.2200, వడ్లకు రూ.2500 మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తాని తెలిపారు. 10లక్షల ఎకరాల్లో చెరుకు పండించేలా చర్యలు తీసుకుంటామన్నారు.