Site icon vidhaatha

Pm Modi | సొంత పార్టీతోనే.. మోడీకి భయం..?

Pm Modi |

విధాత : జీ-20శిఖరాగ్ర సదస్సు విజయవంతంతో ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టతో పాటు తన మైలేజీని కూడా పెంచుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీని విజయవంతంగా నడిపించడంలో ఎదురవుతున్న సవాళ్లను మాత్రం అధిగమించలేకపోతున్నారు. దేశం కోసం విజయవంతంగా పనిచేస్తున్నా పార్టీని మాత్రం విజయ పథంలో నడిపించలేకపోతున్నారన్న భావన క్రమంగా బలపడుతుంది. గతంలో రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాల పనితీరు, అధికారం లేని చోట పార్టీ నాయకుల వ్యవహారశైలీ బీజేపీ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. అవినీతి, కుమ్ములాటలు క్రమశిక్షణా రాహిత్యం పార్టీలో గతంలో కంటే మితిమీరిపోతున్నాయి. బీజేపీలో తలెత్తుతున్న ఈ పరిణామాలు సహజంగానే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని ఇబ్బంది పెడుతున్నాయి.

కర్ణాటక ఎన్నికలలో నరేంద్రమోడీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసిన, భజరంగబలి అస్త్రాన్ని సంధించినా ఓటమిని తప్పించలేకపోయారు. కర్ణాటకలో మోడీ ప్రచారంతో వచ్చిన సానుకూలత కంటే ఎక్కువగా అప్పటిదాకా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అవినీతి అంశం ఎక్కువగా ప్రతికూలంగా మారి పార్టీకి పరాజయాన్ని మిగిల్చిన వైనం విస్మరించలేనిది. ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ సాధించిన ఫలితాలు ప్రధాని మోడీ పాలనకు ప్రతిబింబం కానందునా మోడీకి బాధ లేదు. అయితే బీజేపీ ఎదురీదుతున్న సంకేతాలున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

ప్రధానమంత్రి ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే, రాష్ట్రాల నుండి వస్తున్న వార్తలలో బీజేపీకి సంబంధించి అవినీతి ఆరోపణలు, బీజేపీలో నైతిక గందరగోళం, పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్న ప్రచారం. బీజేపీ ఆధీనంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి కీలకమైన రాష్ట్రాలతో పాటు అత్యధిక రాష్ట్రాలలో ఆ పార్టీ ఇప్పటికి ప్రధానమంత్రి మోడీపై ఎక్కువ ఆధారపడుతుంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం కొత్తగా ఇండియా కూటమి పేరుతో బలం పుంజుకోవడం బీజేపీని భయపెడుతుంది.

అయితే బీజేపీలో ఇటీవల వస్తున్న అవాంఛనీయ మార్పులు ప్రధానంగా వర్గపోరు, ఆధిపత్య రాజకీయాలు, సిద్ధాంతాలకు దూరంగా అవినీతిలో కూరుకుపోవడం వంటివన్ని మోడీ విజయాలను మసక బారుస్తున్నాయి. మునుముందు ఎన్నికలు జరుగాల్సిన రాష్ట్రాలలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ధోరణులు పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయి.

ఐక్యత, క్రమశిక్షణ పార్టీ సొంతమని ఇటువంటి సొల్లు కబుర్లు ఎన్నో బీజేపీ సైద్దాంతిక కర్తలు ప్రచారం చేశారు. ప్రత్యేకంగా మోదీ ప్రభుత్వం గత ప్రభుత్వాలలాగా కాకుండా తమ ప్రభుత్వం అవినీతి పై యుధ్ధం ప్రకటించిందని తాను తినను, మరొకరిని తిననివ్వను అని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ కేంద్రంలో రెండుసార్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచాకా సమయం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వంలో, పార్టీలో ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లోని జిల్లా, స్థానిక స్థాయిలో బీజేపీలో అనేక తప్పుడు ధోరణులు చోటు చేసుకొన్నాయి.

కేంద్ర నాయకత్వం కోరుకొన్నట్లు, ప్రచారం చేసినట్లు, పార్టీ అంతా ఐక్యంగా, ఒకే తీరుగా లేదు. బీజేపీలో అంతా సజావుగా నడుస్తుంది అనుకుంటే ఈ మధ్యనే దేశంలో ప్రపంచ ప్రసిధ్ది గాంచిన జి-20 సమావేశం జయప్రదంగా ముగిసింది. ఈ సమ్మిట్ దేశంలో మొదటి సారి గా జరిగింది. ఈ సమ్మిట్ వల్ల మోడీ ఖ్యాతి , ఖదర్ ప్రపంచంలో పెరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జి-20 విజయం ,చంద్రయాన్-3లతో మోడీ ప్రభావం రాబోయే ఎన్నికల్లో పెట్టుబడిగా వుంటుందని కేంద్రనాయకత్వం ఆశిస్తుంది. మోడీని ముందు పెట్టి కేంద్రంలో మరొక సారి అధికార దాహాం తీర్చు కోవడానికి హ్యాట్రిక్ విజయానికి సన్నద్ధమవుతుంది. అయితే కేంద్ర నాయకత్వం మాట ఎలావున్నా , పార్టీ లో దేశం నలుమూలల నుండీ అందుతున్న రిపోర్టులు, పార్టీలో పెరుగుతున్న పెడధోరణులు మోడీకి స్వతహాగా పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి.

2024 ఎన్నికల్లో పార్టీకి, ఎదురు లేని విజయాలకు ఇవి ముంచుకవచ్చే ముప్పుగా అవుతున్నవని బీజేపీ నాయకత్వం , ఇటూ మోడీ కూడా పార్టీ అంతర్గత మీటింగ్ లల్లో అందోళన చెందుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు. దేశంలోని దాదాపు అన్నీ జాతీయ, స్థానిక ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్ధిని రంగంలోకి దించి బీజేపీని ఓడించాలనే పట్టుదలతో మోడీ ప్రభుత్వ విఫలతలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేగాకుండా మోడీ –అదానీ కి మధ్య స్నేహ బంధం గురించి కూడా ఇండియా కూటమి ప్రజల్లోబాగా ప్రచారం చేస్తుంది.

హెచ్చరికలు పంపిన ఉప ఎన్నికలు

దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలలోకి వెళితే యూపీ, కేరళ, బెంగాల్‌, ఉత్తరాఖండ్‌, త్రిపుర, జార్కండ్‌లలో ఏడు స్థానాల్లో ఇండియా కూటమి నాలుగు స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ మూడింటిలో గెలిచింది. ఉత్తరఖండ్‌లోని భాగేశ్వర్ స్థానం, త్రిపురలో ధాన్‌పూర్‌, బోక్సానగర్ విజయాలతో బీజేపీకి పెద్ద ఊరట లభించింది. 2023 ఆరంభంలో వచ్చిన నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయాల్లో బీజేపీ కూటమి విజయాలందుకుంది.

ఈ క్రమంలో ఉప ఎన్నికల్లో త్రిపురలో ఒక సీటును నిలబెట్టుకుని, వామపక్షాల నుండి మరొక స్థానాన్ని కైవసం చేసుకుంది. ముస్లింలు మెజార్టీగా ఉన్న బోక్సానగర్ స్థానాన్ని మొదటిసారి గెలుచుకుంది. ఈ విజయంలో బీజేపీ ఘనతను తక్కువ చేసేలా ప్రతిపక్షాలు అనే సాకులు చెప్పవచ్చు. పెద్ద ఎత్తున రిగ్గింగ్, సీపీఎం అభ్యర్ధి ఉదాసీనత, సరిహద్దు ప్రజల్లోని సానుకూలత, మాజీ కాంగ్రెస్ మంత్రి, రెండు పర్యాయాలు బోక్సానగర్ ఎమ్మెల్యే బిల్లాల్ మియాన్ ఉప ఎన్నికలకు ముందు బీజేపీకి మారడం వంటి కారణాలు బీజేపీ గెలుపుకు దోహదం చేశాయని విపక్షాల వాదన.

అయితే 66 శాతం ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గంలో బీజేపీ 88 శాతం ఓట్లను సాధించడం గొప్ప విజయం. ఈ అంశాన్ని బీజేపీ దేశ వ్యాప్తంగా సరిగా ప్రచారం చేసుకోలేకపోయిందని చెప్పవచ్చు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ గెలుపుపై త్రిపుర సీఎం మాణిక్ సాహాతో పాటు ఇతర పార్టీ నేతలను అభినందిస్తూ “ఈ ఫలితం ప్రధాని మోడీ నాయకత్వంలో మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజల ఆమోదాన్ని చూపుతుందంటూ ట్వీట్ చేశారు.

అయితే నడ్డా ట్వీట్ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఇబ్బందికరంగా పరిణమించాయి. త్రిపుర ఫలితాలు “డబుల్ ఇంజన్ పాలనకు ప్రజల ఆమోదం” అయితే, యూపీకి చెందిన ఘోసీ ఉపఎన్నిక ఓటమి అందుకు విరుద్ధంగా భావించాలా ? మరి ఆ విషయానికి వస్తే ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో గెలుపు మార్జిన్ కూడా తగ్గింది కదా అన్న చర్చను రేకెత్తించింది. ఇది గతం కన్నా చాలా తక్కువ మెజార్టీ తో లభించిన విజయం. కేరళ, జార్ఖండ్ ల్లో ఒక్కొక్క సీటుకుజరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమినే చవి చూసింది.

జార్ఖండ్ లో ప్రభుత్వ వ్యతిరేకత నెలకొన్నా కూడా బీజేపీ దానిని ఎన్నికల విజయంగా మార్చుకోలేక పోయింది. కేరళ లో ఓట్ల శాతం కొంత పెరిగింది. దానికి కారణం కాంగ్రెస్‌ నుంచి ఈమధ్యనే బీజేపీలోకి మారిన ఏఐసీసీ నేత ఆంథోని కొడుకు, అతని అనుచరుల ప్రభావం ఆ ప్రాంత ఓటర్ల పై బలంగా వుండటమే నని భావిస్తున్నారు. బెంగాల్ లోని ధూప్ గుడి సీటు కు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ గెలుపొందింది. బీజేపీ రెండవ స్థానంలో వుంది.

మొత్తంగా చూస్తే బీజేపీ 3 స్థానాల్లో, ఇండియా కూటమి 4స్థానాల్లో గెలుపొందాయి. ఏమైనా ఉప ఎన్నికలు బీజేపీకి గట్టి సందేశం ఇచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం పైకొన్ని ఆందోళన కలిగించే ప్రశ్నలను లేవనెత్తాయి. ఉప ఎన్నికల ప్రాంతాల్లో బీజేపీలో వున్న, అహంకారం దళితుల పట్ల గల చిన్నచూపు ప్రధాన కారణం అని అంటున్నారు. బీజేపీలోని ఈ గందర గోళంపై ఈ రాష్ట్రాల్లోనే కాకుండా బీజేపీ బలంగా వున్న గుజరాత్, అస్సాం, మేఘాలయ, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాల్లో కూడా పార్టీ శ్రేణుల్లో పేరుక పోయిన అవినీతి ఆరోపణలు, వర్గపోరు పార్టీ పతనానికి బాటలు వేస్తుందంటున్నారు.

ఘోసీ ఫలితం.. బీజేపీకి పాఠం

ఘోసిలో బీజేపీ ఓటమి ఖచ్చితంగా బీజేపీకి షాక్ వంటిదే. దానికి బీజేపీ అధినాయకత్వం ఆదిత్యనాథ్‌ను నిందించగలదా?. ఇక్కడ మరో విషయం దారా సింగ్ చౌహాన్ తిరిగి పార్టీలోకి రావడాన్నియోగి వ్యతిరేకించారని బీజేపీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. యోగి ప్రభుత్వం దళితులు,ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు)కు వ్యతిరేకమని ఆరోపిస్తూ 2022లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చౌహాన్ మంత్రి పదవికి, బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) టికెట్‌పై చౌహాన్ ఘోసీలో గెలిచారు. అయితే బీజేపీలోకి, యోగి కేబినెట్‌లోకి తిరిగి రావాలని ఆ నేత ఆసక్తిగా చూపారు.

డిప్యూటీ సీఎం బ్రీజేష్‌ పాఠక్, బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి-కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితులు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నచ్చచెప్పి చౌహాన్‌ను తిరిగి పార్టీలోకి అనుమతించారు. పార్టీలను, విధేయతలను మార్చుకోవడంలో చౌహాన్ ప్రస్థానం విస్మయకరమే. బీఎస్పీ నుండి ఎస్పీ, ఎస్పీ నుంచి బీఎస్పీ, బీఎస్పీ నుంచి బీజేపీ, మళ్లీ ఎస్పీలోకి తిరిగి బీజేపీలోకి చౌహాన్ చేరిన తీరు అశ్చర్యకరం.

సీఎం యోగి ఆదిత్యనాథ్ చౌహాన్ బీజేపీలోకి తిరిగి రావడాన్ని వ్యతిరేకించడం ఎన్నికల్లో ప్రభావం చూపింది. యోగిని అదుపు చేయాలనే హైకమాండ్ ఆలోచన కోణంలోనే చౌహాన్ చేరికను చూస్తున్నారు. మరోవైపు ఘోసీ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీ వ్యూహంపై కొన్ని ఆందోళన కలిగించే ప్రశ్నలను లేవనెత్తాయి. యూపీ మాజీ సిఎం మాయావతి రాష్ట్రంలో బిఎస్‌పి రాజకీయ శక్తిని మరింత బలహీనపరిచే దిశగా వ్యవహారించగా, ఎస్పీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పుంజుకుంది.

మధ్య ప్రదేశ్‌లో బీజేపీలో తిరుగుబాటు

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగాల్సిన మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీకి ఆ రాష్ట్ర రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) నేతలు చేసిన తిరుగుబాటు షాకిచ్చింది. 2007లో ఆర్‌ఎస్‌ఎస్‌ను వీడిన ఆభయ్ జైన్‌, మనీశ్‌కాలే, విశాల్ బాదల్‌లు జనహిత పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. మధ్యప్రదేశ్ లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా వారు గళమెత్తడం ఎన్నికలవేళ బీజేపీని ఇరుకున పెట్టనుంది. ఈ పరిణామాన్ని అవకాశంగా మలుచుకున్న విపక్షాలు బీజేపీ నేతల అవినీతి పట్ల ఆ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు విసిగిపోయారంటూ విమర్శిస్తున్నారు. తాజాగా అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ సతీమణిపై వచ్చిన 12కోట్ల సబ్సిడీ ఆరోపణలు సైతం బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.

ఐదు రాష్ట్రాలలో ఎదురీతనే

ప్రధాని మోడీ అంతర్జాతీయ స్థాయిలో సాధించే విజయాల స్థాయిలో దేశంలోని బీజేపీ పార్టీ ప్రయాణం లేకపోవడంతో రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఎదురీత తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్ధాన్‌, తెలంగాణలలో బీజేపీ ఆశించిన విజయాలు అందుకోవాలంటే అందుకు మోడీ ఒక్కరి చరిస్మా మాత్రమే దోహదం చేస్తుందనడం మాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సందేహాంగానే కనిపిస్తుంది.

మోడీ మినీ జమిలి ఎన్నికలకు వెళితే జమ్మూకాశ్మీర్‌, అరుణాచల్ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిస్సాలలో సైతం బీజేపీకి పెద్దగా బలమున్న రాష్ట్రాలు కనిపించడం లేదు. మొత్తం మీద మోడీ అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో సాధించిన పాలనా విజయాలంటే పార్టీలో నెలకొన్న అవాంఛనీయ లక్షణాలే రాబోయే 2024 ఎన్నికల్లో విజయానికి అడ్డంకిగా మారనున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే మోడీకి ఇప్పుడు కాంగ్రెస్‌, దాని నాయకత్వంలోని ఇండియా కూటమి భయం కంటే తమ సొంత పార్టీ లో తిష్ఠ వేసిన ఈ అడ్డూ అదుపు లేని అవలక్షణాలే మూడోసారి విజయానికి ఆటంకంగా మారుతాయన్న భయం పట్టుకుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Exit mobile version