విధాత: ఎవరి కోటా వాళ్లకు ఇచ్చుకుంటూ వెళ్తోంది.. ఏదీ వరుసలో నిలబడి వీపు చూపండి.. చురకలు వేయించుకోండి అంటూ అన్ని పార్టీల వాళ్లనూ వాయిస్తోంది. మొన్నటివరకూ భారత రాష్ట్ర సమితి నేతలు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, కవిత తదితరుల వ్యాపారాల మీద ఈడీ, సీబీఐ దాడులు చేసి వాళ్లను పరుగులెత్తించారు. ఇంకా వారి పరుగులు ఆపనేలేదు..
ఇక ఇటు ఏపీలో బ్యాటింగ్ మొదలు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ అంశంలో రూ.240 కోట్లు మింగేసారంటూ టీడీపీ అనుబంధ నాయకులు.. ఇతరులను విచారించింది. ఓహ్ కేవలం టీడీపీ, బీఆరెస్ వాళ్లకే కదా.. మాకేం కాదు కదా అని వైసీపీ వాళ్లు అనుకుంటున్నారో లేదో తెల్లారగానే బెజవాడ వైసీపీ నాయకుల ఇళ్ళమీద, ఆఫీసుల మీద ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్స్ చేసి.. ఎక్కడైనా బావ కావచ్చు.. వంగతోట కాడ మాత్రం బావ కాదన్న మేసేజ్ ఇచ్చారు.
తాజాగా వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు సంబంధించి కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. విజయవాడ నగరంలోని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ స్థలానికి సంబంధించి లావాదేవీల వ్యవహారంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ నేతల వ్యాపార కార్యకలాపాలపై కూడా ఐటీ కన్నేసిందని ఈ ఎపిసోడ్‌తో తెలిసొచ్చింది. దీంతో వైసీపీ వ్యాపారవేత్తలు అప్రమత్తం అవుతున్నారు. అంతేకాక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి మీద, వ్యాపార సంస్థలమీద కూడా ఐటి దాడులు జరిగాయి.
ఇక్కడ బీజేపీ, అనుకూల వ్యతిరేక పార్టీలు అనే తేడా లేకుండా ఎవర్నీ వొగ్గేదే ల్యా ! అంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఎవరు ఎక్కడ చిక్కితే అక్కడ బుక్ చేసి దారికి తెచ్చుకుంటున్నారు.