Site icon vidhaatha

IT Rides | ఐటీ సోదాల ల‌క్ష్యం? తెలంగాణ‌లో 80 గంటల పాటు తనిఖీలు

IT Rides

విధాత: అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లు, కార్యాల‌యాలలో 80 గంట‌ల‌ పాటు ఆదాయ‌పు ప‌న్ను శాఖ నిర్వహించిన సోదాలు సంచ‌ల‌నం సృష్టించాయి. శాస‌న‌స‌భ ఎన్నిక‌లు మ‌రి కొద్దినెల‌ల్లో జ‌రిగే నేప‌థ్యంలో అధికార పార్టీ నేత‌లు టార్గెట్‌గా జ‌రిగిన ఈ సోదాలు బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కలవరానికి గురి చేశాయి.

ఎమ్మెల్యేలు పైళ్ల శేఖ‌ర్‌రెడ్డి, మ‌ర్రి జ‌నార్ద‌న్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డిల‌ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేసి నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఢిల్లీ లిక్క‌ర్ కేసు ముగిసింద‌నుకుంటున్న త‌రుణంలో బీఆర్ ఎస్ నేత‌ల‌పై మ‌రోసారి దాడులు వెనుక ల‌క్ష్యం ఏంట‌నే విషయంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

మర్రి ఇంట్లో కీలక ఫైళ్లు స్వాధీనం?

ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధన్‌రెడ్డికి సంబంధించిన కూక‌ట్‌ప‌ల్లి, అమీర్‌పేట జేసీ బ్ర‌ద‌ర్స్ షాపింగ్ మాల్స్‌లో ఐటీ అధికారులు గంట‌ల త‌ర‌బ‌డి సోదాలు చేశారు. కీల‌క ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మ‌ర్రి జ‌నార్ద‌న్‌రెడ్డికి, ఏపీలో అనంత‌పురం జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్రస్థాయి నేత‌కు మ‌ధ్య చాలాకాలం నుంచి పెద్ద ఎత్తున‌ వ్యాపార లావాదేవీలు ఉన్న విష‌యం కూడా ఈ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో విచార‌ణ‌కు రావాల‌ని ఐటీ అధికారులు చెప్పారు. అధికార పార్టీ నేత‌ల‌పై ఐటీ శాఖ సోదాలు జ‌రుగుతున్న‌ప్పుడు బీఆర్ఎస్ నేత‌లు ఐటీశాఖ‌కు, మోడీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

త‌మిళ‌నాడు మంత్రి సెంథిల్ బాలాజీ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించినప్పుడు కూడా ఇలా వ్య‌తిరేక ఆందోళ‌న‌లు చేసిన‌ప్పుడు వెంట‌నే అరెస్టు చేసిన ఐటీ అధికారులు తెలంగాణ‌లో మాత్రం అలా చేయ‌కుండా నోటీసులతో స‌రిపెట్టడం గమనార్హం.

ఈ సోదాల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడైన ఒక ప్ర‌జాప్ర‌తినిధికి బినామీగా ఉన్న ఎమ్మెల్సీ పాత్రపై కీల‌క ఆధారాలు ల‌భించిన‌ట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. మ‌ర్రి జ‌నార్ద‌న్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సీఎం స‌న్నిహిత ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య ఈ రెండేళ్ల‌లో భూ అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌లో జ‌రిగిన ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాలు, నిధుల మ‌ళ్లింపునకు సంబంధించిన ఆధారాల‌పై ఐటీ శాఖ ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన‌ట్లు చెబుతున్నారు.

ఏడు వేల కోట్లు ఎవరి ఖాతాలో?

హైద‌రాబాద్‌తోపాటు, తెలంగాణ‌లోని కీల‌క ప్రాంతాల్లో వీరు, వీరి బినామీల పేర్ల‌తో ఉన్న భూముల కొనుగోళ్లు, మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారాలపై ప్ర‌ధానంగా ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని అంటున్నారు. దాదాపు 5 వేల నుంచి 7 వేల కోట్ల రూపాయ‌ల విలువైన భూముల పందేరం జ‌రిగిన‌ట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంద‌ని, ఈ డ‌బ్బులు ఎవ‌రి ఖాతాల్లో ప‌డ్డాయ‌న్న దానిపై లోతుగా విచార‌ణ జ‌రుగుతోంద‌ని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version