విధాత: ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా అన్నిరకాలుగా సంసిద్ధులై ఓట్ల సమరానికి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి జగన్ ఈనెల 7న బీసీ గర్జన అమరావతిలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అంటే రానున్న ఎన్నికల్లో బీసీల మద్దతుతో మళ్లీ పీఠం ఎక్కేందుకు ఇదో అస్త్రం అన్నమాట.
ఈ మూడేళ్లలో బీసీలకు తాము ఎన్నిచేసాం.. ఎంత చేశాం.. గత టీడీపీ కన్నా మేం ఏమి అదనంగా ఇచ్చాము అన్నది వివరించి, బీసీల మద్దతు కోరాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారికి రాజ్యసభ సీట్లిచ్చి తాము ఎంతగా నెత్తిన పెట్టుకున్నామో చెబుతారన్నమాట. ఇంకా కేబినెట్లో, స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్ పదవుల్లో తాము బీసీలకు ఎలాంటి వాటా ఇచ్చామన్నది వివరిస్తారు.
అన్నిపదవుల్లోనూ, బడ్జెట్లలోనూ బీసీలకు దాదాపు 70శాతం వాటా ఇచ్చినట్లు వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ తమ వాయిస్ గట్టిగా వినిపించి బీసీల మద్దతు పొందడం ఈ గర్జన ప్రధాన ఉద్దేశం. దీనికోసం ఇప్పటికే క్యాడర్‌కు సమాచారం వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున గెలిచిన ప్రజా ప్రతినిధులు అంతా సభకు రెడీ అవుతున్నారు.