Site icon vidhaatha

జగన్ టూర్.. పోలీసుల అత్యుత్సాహం!

విధాత‌: అదేంటో.. జగన్ పర్యటన ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఆయన ఏ ఊరు వెళ్లినా.. ఏ కార్యక్రమానికి వెళ్లినా ముందస్తుగా పోలీసుల ఆంక్షలు.. పరదాలు.. భారీ బారికేడ్లు.. చివరకు ప్రజలు వేసుకునే దుస్తుల రంగుల మీద కూడా కంట్రోల్ ఉండ‌డం. మొన్న నరసాపురంలో నల్ల చున్నీలు వేసుకున్నందుకు మహిళలు, యువతలు కూడా ఇబ్బందులు పడ్డారన్న వార్తలు వచ్చాయి. దీన్ని ప్రతిపక్షాలు సైతం గట్టిగానే విమర్శిస్తున్నాయి.

వాస్తవానికి ఇన్ని రూల్స్.. ఇంత‌టి నిర్బంధం పోలీసులు ఎందుకు విధిస్తున్నారు? ఇదంతా జగన్‌కు, ఆయన కార్యాలయానికి తెలిసే జరుగుతోందా.. లేదా పోలీసులు అత్యుత్సాహం చూపుతూ జగన్ ఇమేజీని దెబ్బ తీస్తున్నారా… అంటే అంతా అయోమయంగా ఉంద‌నే స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలతో ఉండాలని, వారితో మాట్లాడాలని కోరుకుంటారు. ప్ర‌జ‌ల కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన‌, వేలమందితో మాట్లాడిన జగన్ ఇప్పుడు ఇలా నిర్బంధం మధ్య ఎందుకు పర్యటిస్తున్నారని ప‌లువురు గుస‌గుస‌లాడుతున్నారు. పోలీసులే ఇలా కావాలని చేస్తుంటే మాత్రం ఆయన వద్దని వారించాల్సిన అవసరం ఉంద‌ని అనుకుంటున్నారు.

తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగే జగనన్న భూ సర్వే.. భూరక్ష పథకం రెండో దశ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా పోలీసులు చేసిన అత్యుత్సాహం కూడా విమర్శలకు గురైంది. ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో ఉన్న కూరగాయల దుకాణాల్ని రెండు రోజుల ముందు నుంచే తొలగించారు. సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ పేరుతో ట్రాఫిక్ ను పలుమార్లు ఆపడం.. ఇదంతా ప్రజలకు అసౌకర్యం కలిగించింది.

త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న ముఖ్యమంత్రి ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి. వీలైతే సెక్యూరిటీ కూడా సడలించుకుని ప్రజల్లో ఉండాలి. కానీ ఇలా నిర్బంధాల నడుమ ఆయన వెళ్తే ప్రజలు ఆయన్నుఎలా కలుస్తారు. ప్రజలకి ఆయన దూరమ‌య్యార‌నే సంకేతాలు వస్తే అవి ఎన్నికల్లో ప్రతికూలతను చూపవా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Exit mobile version