విధాత: కశ్మీర్‌లో భూంకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. కశ్మీర్‌లోని దోడా జిల్లాలోని గందోహ్ బాలేస్సా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో, 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని తెలిపారు. భూకంపం సంభవించిన సమయంలో స్థానిక నివాసాల్లో సీలింగ్ ఫ్యాన్లు ఊగినట్లు పేర్కొన్నారు. గ్యాస్ స్టవ్‌లు, ఇతర పరికరాలు కదిలాయని స్థానికులు తెలిపారు.
కశ్మీర్‌లో సంభవించిన భూకంప ధాటికి దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ – ఎన్‌సీఆర్, పంజాబ్‌లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనాలు తమ నివాసాల నుంచి భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే ప్రస్తుతానికి ఎలాటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పాకిస్తాన్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1:04 గంటల సమయంలో భూమి కంపించిందని పేర్కొన్నారు. తూర్పు కశ్మీర్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందన్నారు.