విధాత: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం మరోసారి తీవ్ర చర్చనీయాంశానికి దారి తీసింది. జయలలిత మరణించిన విషయాన్ని దాదాపు 31 గంటల ఆలస్యం తర్వాత ప్రపంచానికి చెప్పారని జస్టిస్ ఆర్ముగస్వామి నివేదిక వెల్లడించింది. ఈ అంశంలో జయలలిత స్నేహితురాలు శశికళను విచారించాలని శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో పేర్కొన్నది.
ఈ నివేదికలో జయలలితకు సరైన వైద్యం అందలేదని, సరైన వైద్యం అంది ఉంటే ఆమె బతికి ఉండే వారని పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతున్నది. ఈ అంశం తమిళనాడులో మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. జయలలిత మృతిపై జస్టిస్ ఆర్ముగస్వామి నివేదిక సంచలన విషయాలు బహిర్గతం చేసింది. ఇవాళ తమిళనాడు శాసనసభలో ఆ నివేదికను ప్రవేశపెట్టారు.
ఇప్పుడు ఈ నివేదికలోని అంశాలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచానికి తెలిసి విషయాలకు విరుద్ధంగా ఈ అంశాలు ఉండటం సంచలనంగా మారింది. జయలలితతో పాటు మరికొందరిపై సంచలన ఆరోపణలు చేస్తూ జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక సమర్పించింది.
2012లో శశికళను పోయెస్ గార్డెన్ నుంచి తరిమేసినప్పటి నుంచి జయలలిత, శశికళల మధ్య సత్సంబంధాలు లేవని నివేదిక పేర్కొన్నది. జయలలితకు యాంజియోగ్రఫి చేయాలని డాక్టర్ సమిన్ శర్మ సూచించిన తర్వాత కూడా ఆమెకు యాంజియోగ్రఫి చేయలేదని కమిషన్ తన నివేదికలో తెలిపింది.
వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి సిద్ధమని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా అది కార్యరూపం దాల్చ లేదని చెప్పింది. సరైన చికిత్స అందించి ఉంటే జయలలిత ప్రాణాలు కాపాడేవారని విచారణ నివేదికలో పేర్కొన్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ 2016 సెప్టెంబర్‌లో జయలలిత స్పృహ తప్పి పడిపోయినప్పటి నుంచి అంతా గోప్యంగానే ఉన్నదని పేర్కొన్నది.
జయలలిత మరణాన్ని డిసెంబర్ 5న అధికారికంగా ప్రకటించగా సాక్ష్యాధారాల ఆధారంగా ఆమె డిసెంబర్ 4న మరణించినట్లు కమిషన్ పేర్కొన్నది. ఈ కమిషన్ నివేదికలో ముఖ్యమైనది జయలలిత మరణించిన సమయం. ఆమె 2016 డిసెంబర్ 5న రాత్రి 11 గంటలకు మరణించిందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే జయలలిత అంతకు 31 గంటల ముందే మరణించిందని ఆర్ముగస్వామి కమిషన్ పేర్కొన్నది.
ఆమె ఉంచిన ప్రత్యేక వార్డులో విధుల్లో ఉన్న పారా మెడికల్ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం 2016 డిసెంబర్ 4న సాయంత్రం 3.50 గంటలకే మరణించారని కమిషన్ నివేదికలో వెల్లడించింది. ఆ సమయానికే ఆమె గుండె ఆగిపోయిందని తెలిపారు. జయలలిత సన్నిహితురాలు శశికళ, అప్పటి చీఫ్ సెక్రటరీ డాక్టర్ రామ్మోహన్ రావు, కె.ఎస్.శివకుమార్, తదితరులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఆర్ముగ స్వామికి సిఫారసు చేసింది.