Site icon vidhaatha

BRSలోకి జేడీ, గంటా.. ప్రముఖులతో చర్చలు!

విధాత‌, సినిమా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పురుడుపోసుకున్న భారత రాష్ట్ర సమితి మరింత జవసత్వం ఇవ్వడానికి పార్టీ ముఖ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు వంటివారు పార్టీలో చేరగా ఆ తరువాత ఇంకెవరూ పార్టీలోకి రాలేదు. అయితే ఇప్పుడు ఇంకొందరు గట్టి వాళ్ళను పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నారు.

ముఖ్యంగా కాపు నాయకులు తమ వైపు వస్తే మేలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర నాందేడ్‌లో భారీ సభను నిర్వహించాలని చూస్తున్న కేసీఆర్ తన తరువాతి సభ విశాఖలో పెట్టాలని అనుకుంటున్నారు.

విశాఖలో భారీ సభ ద్వారా తన ఉనికి చాటే లక్ష్యంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీద గురి పెట్టారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్యేగా చేయాలని ఆయన రెడీగా ఉన్నట్టు సమాచారం.

ఇక జేడీ లక్ష్మీనారాయణ 2019లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ దాదాపు రెండున్నర లక్షలకు పైగానే ఓట్లు తెచ్చుకుని విద్యావంతులు, యువత మద్దతు పొందారు. మళ్ళీ ఆయన విశాఖ నుంచి పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆయనతో ఫోన్లో మాట్లాడారని, తమ పార్టీలోకి చేరాలని కోరినట్లు చెబుతున్నారు. దీనిమీద ఏమీ తేల్చలేదని సమాచారం. దీంతో బాటు విశాఖలో ఒక కార్యక్రమం కోసం వచ్చిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గంటా శ్రీనివాసరావుతో పాటు జేడీ లక్ష్మీనారాయణను కలిశారని అంటున్నారు.

ఈ ఇద్దరు నేతలతో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరే విషయం మాట్లాడారని అంటున్నారు. ఎలాగైనా ఈ ఇద్దరు నేతలను తమ పార్టీలోకి రప్పించాలని కేసీఆర్ చూస్తున్నారని అంటున్నారు. మున్ముందు ఏమి జరుగుతుందో చూడాలి

Exit mobile version