విధాత: మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలుకు చివరి రోజు కావడంతో ఆయన అనూహ్యంగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి మునుగోడులో ప్రజా శాంతి పార్టీ తరఫున ప్రజా కవి గద్దర్ పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితం కేఏ పాల్ ప్రకటించారు.
అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేఏ పాల్ ఆఫీసుకు వద్దకు వెళ్లిన గద్దర్ కార్యాలయం లోపలికి వెళ్లకుండానే వెనుదిరగడం అనేక అనుమానాలు రేకెత్తించాయి. ఈ అంశంపై స్పందించిన కేఏ పాల్ గద్దర్ కు ఎలాంటి అసంతృప్తి లేదని.. ఆయన నామినేషన్ వేస్తారని స్పష్టం చేశారు.
శుక్రవారం నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే గద్దర్ నామినేషన్ వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ప్రజా శాంతి పార్టీ తరఫున తానే నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు.
అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నాయని, కేవలం నామినేషన్ ప్రక్రియ కోసమే ప్రధాన పార్టీలు రూ.100 నుంచి 200 కోట్ల వరకు ఖర్చు చేశాయని కేఏ పాల్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికలో డబ్బు ఆశ చూపుతూ జనాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
ఒక్కో ఓటుకు సగటున రూ. 30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నందున ఎన్నిక స్వేచ్ఛయుతంగాగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని.. ఓటర్ల జాబితాలో కూడా అక్రమాలు జరుగుతున్నందున ఉప ఎన్నికను వాయిదా వేయాలని కేఏ పాల్ ఎన్నికల కమిషన్‌ను లిఖితపూర్వకంగా కోరారు.