- పెచ్చుమీరుతున్న దళారుల, కబేళా వ్యాపారుల ఆగడాలు
- ఆగ్రహించిన రైతులు.. ఆందోళన
- పోలీసుల రంగప్రవేశం..
- రైతుకు న్యాయం చేస్తామని హామీ
విధాత: కోదాడ పశువుల సంతలో రైతుపై కబేలా వ్యాపారి దౌర్జన్యం(kabhela vyapari dourjanyam) పట్ల రైతులు ఆందోళనకు దిగారు. హుజుర్ నగర్(Huzurnagar)కు చెందిన రైతు బత్తుల అంజయ్య(Battula Anjayya) ఆవుదూడలను అమ్ముకునేందుకు సంతకు తీసుకురాగా కబేలా బేరగాడు అక్బర్(Akbar) తాము చెప్పిన పదివేల రేటుకే దూడను తనకే అమ్మాలంటూ దౌర్జన్యానికి దిగాడు.
50వేల దూడను పది వేలకు ఇవ్వనని, అయినా తాను దూడను కబేలాకు అమ్మను అని, రైతులకే అమ్ముతానని రైతు అంజయ్య చెప్పాడు. తనకు దూడను అమ్మాల్సిందేనంటూ అక్బర్ కర్రతో రైతును కొట్టి అతని వద్ద ఉన్న దూడను లాక్కొని పోబోయాడు. అంజయ్య అడ్డుకోగా కోపంతో అక్బర్ దూడను గట్టిగా కొట్టగా అక్కడే ప్రాణం విడిచింది. దీంతో ఆగ్రహించిన రైతులంతా ఒక్కటవ్వగా అక్బర్ పారిపోయాడు.
బాధిత రైతుకు న్యాయం చేయాలని కోరుతూ మృతి చెందిన కోడె దూడను రోడ్డుపై వేసి రైతులంతా ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. మృతి చెందిన దూడకు పోస్టుమార్టం జరిపించారు.
కోదాడ పశువుల సంతలో దళారీలు, కబేలా వ్యాపారులు ముఠాలుగా ఏర్పడి రైతులపై దౌర్జన్యాలు చేయడం ఇటీవల కాలంలో మీతిమిరిందని, దీనిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని రైతులు తమ పశువులను సంతలో స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు తెలంగాణలో అతిపెద్ద పశువుల సంతగా ఉన్న కోదాడ సంతకు ఇప్పుడు దళారీలు, కబేల వ్యాపారుల భయానికి చుట్టుపక్కల గ్రామాల రైతులు సంతకు దూరంగా ఇతర ప్రాంతాల సంతలకు వెళ్తున్నారని రైతులు వాపోయారు. వెంటనే పోలీసులు సంతలో వారు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.