fire accident in new secretariat, ka paul
- దేవుడే వ్యతిరేకంగా నిలిచాడని వ్యాఖ్య
- ఇప్పటికైనా కేసీఆర్ మనసు మార్చుకోవాలని సూచన
విధాత: నిర్మాణంలో ఉన్న కొత్త సచివాలయం భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. ‘దేవుడే ఈ బిల్డింగ్ ప్రారంభించ వద్దని మీకు వ్యతిరేకంగా నిలబడినాడు. నాతో పెట్టుకుంటే ఇలగే ఉంటది’ అని కామెంట్ చేశారు.
కేసీఆర్ పుట్టిన రోజు నాడు కొత్త భవనాన్ని ప్రారంభించాలన్న నిర్ణయాన్ని పాల్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంలో హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. నూతన సెక్రటేరియట్ సమీపంలో నిర్మితమవుతున్న అమరవీరుల స్మృతి చిహ్నం దగ్గరకు శుక్రవారం వెళ్లగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాల్.. అక్కడే మీడియాతో మాట్లాడారు.
అంబేద్కర్ పేరిట నిర్మిస్తున్న సెక్రటేరియట్‌ను ముఖ్యమంత్రి పుట్టిన రోజున ప్రారంభించడమేంటని నిలదీశారు. ‘కేసీఆర్ గారూ.. వింటున్నారా? చూస్తున్నారా? ఏమిటి ఈ గుండాయిజం, రౌడీయిజం? చట్ట విరుద్ధమైన పనులు మీరు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు.
‘నేనంటే మీకు భక్తి, భయం కదా! అమరవీరుల స్థూపం దగ్గరికి నేను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? మీ ఆదేశాల మేరకే కదా వారు అడ్డుకున్నారు? డాక్టర్ అంబేద్కర్ సచివాలయాన్ని కేసీఆర్ పుట్టినరోజు ప్రారంభించడం ఏమిటి? చరిత్రలో దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా? అని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు వివరించి వచ్చాను. నిన్ననే దీనిపై పిల్ వేశాను’ అని అన్నారు.
‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఏమిటి? మీ పుట్టిన రోజున ప్రారంభించడం ఏమిటి? నేను అరవై ఏళ్లలో పుట్టిన రోజు చేసుకున్నానా?’ అని అన్నారు. పైగా.. ‘మీకు పుట్టిన రోజు జరుపుకోవాలని ఉంటే నా చారిటీకి రండి.. ఘనంగా చేద్దాం’ అంటూ సీఎంకు ఆఫర్ ఇచ్చారు.
‘వాస్తు బాగా లేదని బిల్డింగులు కూలగొట్టారు. రూ. 600 కోట్లతో ఈ సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. నేను వద్దని చెప్పాను. ఇప్పుడు అగ్నిప్రమాదం జరిగింది. దేవుడు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాడు అర్థం చేసుకోవాలి’ అని సలహా ఇచ్చారు.
ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజునే సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని పాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదంటే మీరు కోర్టులో నిలబడాల్సి ఉంటుందని హెచ్చరించారు. దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని పాల్ చెప్పారు.
కేసీఆర్‌కు ప్రధాని అయ్యే అవకాశం ఒక్క శాతం కూడా లేదని అన్నారు. ఈ అవినీతి ఎంతో కాలం చెల్లదని, కేసీఆర్ మనసు మార్చుకుని మార్పు చెందాలని, పశ్చాత్తాపం పొందాలని సూచించారు. ‘దేవుడే ఈ బిల్డింగ్ ప్రారంభించవద్దని మీకు వ్యతిరేకంగా నిలబడినాడు. నాతో పెట్టుకుంటే ఇలగే ఉంటది’ అంటూ ముగించారు.