బీఆరెస్, బీజేపీ ఒక్కటే
మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు
కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి
ఇచ్చిన హామీలు అమలు చేస్తాం
మెదక్ నుండి ఇందిరాగాంధీ గెలిచి…
ప్రపంచస్థాయిలో ప్రఖ్యాతిగాంచారు
ఆమె హయాంలోనే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ..
బీడీఎల్, ఓడీఎఫ్ ఫ్యాక్టరీలు వచ్చాయి
మోడీ…కేసీఅర్ లు ఒక్కటే…
మెదక్ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే…
విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న కేంద్రంలోని ప్రధాని మోదీ, అందుకు మద్దతునిస్తున్న కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం మెదక్ రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఇక్కడి నుండి ఇందిరాగాంధీ గెలుపొండటంతో మెదక్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఓడీఎఫ్, బీడీఎల్, బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే మోదీ ప్రభుత్వం వాటిని తెగనమ్ముతున్నదని విమర్శించారు. ఇందుకు తెలంగాణ ముఖ్య కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. బీఆరెస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ నాయకులను భయపెట్టాలని చూస్తే తిరిగి భయపెడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఖర్గే హెచ్చరించారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్, నెహ్రు సారథ్యంలో రాజ్యాంగం రూపొందించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని చెప్పారు. ఒక్కప్పుడు పన్నుకట్టే వారికే ఓటు హక్కు ఉండగా దానిని ప్రతిఒక్కరికీ కల్పించామన్నారు. ఫలితంగా ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్ లాంటి పదవులు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక మరిన్ని అవకాశాలు కల్పించారన్నారు. ప్రజలకోసం, ప్రజాస్వామ్య రక్షకులకు మద్దతునివ్వాలని ఖర్గే కోరారు.
సోనియా పుణ్యం వల్లే కేసీఆర్ కుటంబానికి పదవులు
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ ఇవ్వటం వల్లే కేసీఆర్, ఆయన కుటుంబం పదవులు అనుభవిస్తున్నట్టు ఖర్గే చెప్పారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ప్రతి పథకం అవినీతి మయం అయిందన్నారు. మిగులు బడ్జెట్‌రాష్ట్రాన్ని నేడు రూ. 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనకు, చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల్లో హామీ ఇచ్చి పథకాలను అమలు చేస్తున్న మాదిరిగా తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలను అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తామని ఖర్గే ప్రకటించారు. మెదక్, నర్సాపూర్, దుబ్బాక అభ్యర్థులు రోహిత్, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.