Site icon vidhaatha

Dalitha Bandhu | రెండో విడుతలో 1.30లక్షల మందికి దళితబంధు

Dalitha Bandhu, Telangana Cabinet |

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు (Dalitha Bandhu) పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడుతలో పలు నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు యూనిట్లు అందజేయగా.. త్వరలో రెండో విడత ప్రక్రియను చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) ప్రకటించారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైంది. సమావేశం అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు మీడియాకు వివరించారు.

‘రాష్ట్ర కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించి, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం, పోడు భూముల పట్టాల పంపిణీ తదితర పేదలకు సంబంధించిన అంశాలపై కేబినెట్‌ లోతైన చర్చ జరిపి, నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దళిత బంధులో 1.30లక్షల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నది.

దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దళితవర్గాలు దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ వైపు చూస్తున్న పరిస్థితి. వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చి దళితబంధుపై స్టడీ చేసి వెళ్తున్నారు.

దళితబంధు పథకం ఆగస్ట్‌ 16, 2021న ప్రారంభమైంది. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్ట్‌ 16న రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని హుజూరాబాద్‌లో వందశాతం లబ్ధిదారులకు అందించాం. మిగతా 118 నియోజక వర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధును రెండో విడతలో అందించాలని నిర్ణయం తీసుకున్నాం.

118 నియోజకవర్గాల్లోని 1,29,800 మంది లబ్ధిదారులకు అందించనుండగా.. మరో 200 మందికి చీఫ్‌ సెక్రెటరీ నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేయనున్నాం. మొత్తం 1.30లక్షల మందికి అందిస్తాం. గతంలో దళితబంధు అందించే ప్రక్రియ ఎలా అయితే కలెక్టర్ల ద్వారా జరిగిందో.. ఈ సారి కూడా అదేవిధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ శాఖ అధికారులతో పాటు సీఎస్‌ను ఆదేశించడం జరిగింది’ అని హరీశ్‌రావు వివరించారు.

Exit mobile version