KISSING |
విధాత: శృంగారానికి తొలి అడుగు అధర చుంబనం (Adhara Chumbanam ). మరి మానవ జాతిలో ఎప్పటి నుంచి ముద్దు పెట్టుకోవడం ప్రారంభమయింది? ఇదే శాస్త్రవేత్తలను ఎప్పటి నుంచో తొలుస్తున్న ప్రశ్న. ఇప్పటి వరకు దొరికిన లిఖిత ఆధారాల ప్రకారం.. నా పై పెదవి తడిగా మారుతుంది. నా దిగువ పెదవి వణుకుతుంది. నేను అతడిని కౌగిలించుకుంటాను. ముద్దు పెట్టుకుంటాను ఇదీ 4000 ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఓ కవితలో భాగం. మెసపటోమియా నాగరికతకు చెందిన కవి ఎవరో మట్టి పలకపై రాసిన ఈ సుదీర్ఘ కవిత తొలిసారి ముద్దు గురించి ప్రస్తావించింది. అయితే ప్రాచీన మానవులు దాని గురించి రాయడానికన్నా ముందే.. ముద్దు పెట్టుకోవడం ఉండేదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఎందుకు కనుక్కోవాలి?
ముద్దు ఎప్పటి నుంచి మొదలైందో ఎందుకు కనుక్కోవాలి అని ఎవరైనా అనుకోవచ్చు. స్త్రీ పురుషుల మధ్య శృంగార భావనలు పెంచడంలోనే కాదు.. అంటువ్యాధుల వ్యాప్తి మొదలైందీ ముద్దు తోనే. అందుకే ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలైందో తెలియడం… అంటు వ్యాధుల వ్యాప్తిపై పరిశోధనను ముందుకు తీసుకెళ్లడానికి అవసరం. అందులోనూ ముద్దు రెండు రకాలు, స్నేహితులు, బంధువులు బుగ్గకు బుగ్గ తాకించేది ఒకటి కాగా… ప్రేమికులు, భార్యభర్తలు పెట్టుకునే అధర చుంబనం (లిప్‌లాక్) ఒకటి. దీని పైనే శాస్త్రవేత్తలు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.
ముద్దులో ఇంత ఉందా?
ముద్దు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే సమయంలో దాని గురించి చాలా విషయాలు తెలిశాయి. ముఖ్యంగా ముద్దు పెట్టుకునేటపుడు లాలాజలాన్ని ఒకరికొకరు ఎందుకు మార్చుకుంటారో చాలా కాలం తెలియలేదు. ఇప్పడు దీని గుట్టును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చుంబనం సమయంలో మన నోటి వాసన బాగోకపోతే.. వెంటనే భాగస్వామి ఆ ప్రక్రియను ఆపేసే అవకాశమే ఎక్కువ.
అయితే లాలాజలాన్ని ఒకరికి ఒకరు మార్చుకోవడం ద్వారా అందులో ఉండే హార్మోన్స్.. అతడు లేదా ఆమె తన భాగస్వామి అన్నట్టు మెదడుకి సంకేతమిచ్చి.. చుంబనాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు. ముద్దు ఎందుకు పెట్టుకోవాలనిపిస్తుంది అనే దానిపైనా పరిశోధకులకు ఏకాభిప్రాయం లేదు. సున్నితమైన మన పెదాలు, నాలుకపైన రాపిడి .. మన బ్రయిన్‌లో సుఖాన్నికలగజేసే భాగాన్ని యాక్టివేట్ చేస్తుందనేది ఎక్కువ మంది అంగీకరించిన విషయం.
ఎప్పటి నుంచి మొదలయింది?
నియాండర్తల్స్, మానవులు వేరు వేరు జాతులు అయినప్పటికీ రెండు జాతులూ శృంగారంలో పాల్గొన్నాయని శాస్త్రవేత్తల అంచనా. ఆ కాలంలోనే ముద్దు కూడా పుట్టి ఉంటుందని భావిస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికిన 48,000 వేల ఏళ్ల నాటి ఒక నియాండర్తల్ దంతంపై మానవుడి నోట్లో ఉండే మైక్రోఆర్గానిజంని కనుగొన్నారు.
ఇది ముద్దు వల్లే జరిగి ఉంటుందనేది ఒక ఊహ. చారిత్రక ఆధారాలు మాత్రం 11 వేల క్రితం నాటి నుంచి లభ్యమవుతున్నాయి. 4500 ఏళ్ల క్రితం నాటి మెసపొటేమియా నాగరికత ప్రజలు మాత్రం ఈ ముద్దుపై విరివిగా రచనలు చేశారు. భారత్, ఈజిప్ట్ దేశాల్లోనూ అధర చుంబనంపై ప్రాచీన గ్రంధాలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి.
వైరస్‌తో ప్రమాదం..
ముద్దు పెట్టుకునేటపుడు ముఖ్యంగా హెర్ప్స్ సింప్లెక్స్ వైరస్ (హెచ్ ఎస్ వి 1 ) సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భాగస్వామి లాలాజలం ద్వారా శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన జలుబును కలగజేస్తుందని వెల్లడించారు. గాఢమైన అధర చుంబనం సమయంలో సుమారు ఒక బిలియన్ బ్యాక్టీరియా పరస్పరం మార్పిడికి గురవుతుందన్నారు. అయితే ప్రాచీన నాగరికత మనుషులకు ఈ విషయం తెలియపోవడంతో.. ఆ ప్రజలు అంటువ్యాధుల బారిన పడి ఉండటానికి అవకాశం ఎక్కువ ఉండేదని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం 50 ఏళ్ల లోపు వయసున్న 3.7 బిలియన్ల మంది హెచ్ ఎస్ వి 1తో ఇబ్బంది పడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కగట్టింది. చివరిగా… ముద్దు వల్ల వైరస్ వ్యాప్తి జరుగుతున్నప్పటికీ.. అది ఎప్పుడూ మానవాళిని తుడిచిపెట్టేసేంత ప్రమాదకరంగా పరిణమించలేదు. పైగా ప్రేమికులకు కామోద్దీపనాన్ని కలగజేసి మానవ జాతి పెరగడానికి తొలిమెట్టుగా నిలిచింది. ఇక చుంబనం అనేది మానవుడు అనే వాడు పుట్టినపుడే ఉనికిలోకి వచ్చిందనేది మరో వాదన. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ.. అలా అని నమ్మితే పోయేదేముందనేది కొందరి ప్రశ్న.