Site icon vidhaatha

కోన‌ వెంక‌ట్ గంజాయి స్మ‌గ్లింగ్ చేశాడ‌ట‌..

విధాత‌: కోన వెంకట్… ఇది ఒకప్పుడు ఒక బ్రాండ్ నేమ్. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, వెంకీ, సాంబ వంటి చిత్రాలకు పనిచేశారు. ఆ తరువాత ఒక్కసారిగా ఆయన తన ట్రాక్ మార్చారు. ఢీ చిత్రంతో సరికొత్త ఒర‌వ‌డికి, కన్ఫ్యూజన్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.

అదే తరహాలో రెడీ, కింగ్, అదుర్స్, డాన్ శీను, దూకుడు, బాద్‌షా, బలుపు వంటి ఎన్నో రచనలతో రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. శ్రీను వైట్ల కాంబినేషన్‌లో కోన వెంకట్ పనిచేసిన చిత్రాలు ఓ సెన్సేషన్. ఓ సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాయి.

అలాగని ఈయన అల్లాటప్ప వ్యక్తి కాదు ఈయన తాతయ్య కోన ప్రభాకర్ రావు మహారాష్ట్ర సిక్కింలకు గవర్నర్‌గా పనిచేశారు. పుదుచ్చేరికి నాడు ఆయన లెఫ్ట్నెంట్ గవర్నర్. బాపట్ల నుంచి ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు.

ప్రస్తుతం కోన వెంకట్ డైరెక్టర్ బాబి దగ్గర ఆస్థాన రచయితగా పనిచేస్తున్నారు. ఆయన పనిచేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ తాజా చిత్రం ఈ సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ

సందర్భంగా కోన వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. తన చిన్ననాటి సంగతులను పంచుకున్నాడు. ఒక నేరం చేసిన విషయాన్ని ఓపెన్‌గా చెప్పేశాడు. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నాడు. నేను కాలేజీ చదివే రోజుల్లో గంజాయి స్మగ్లింగ్ చేశాను అని తెలిపాడు.

ఆయన మాట్లాడుతూ.. నా స్నేహితుడు ఒకడు ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి గంజాయి పండించేవాడు. దానిని అమ్మే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. వాడు చావు బతుకుల్లో ఉన్న సమయంలో మాకు విషయం తెలిసింది.

వాడి అప్పులు ఎలాగైనా తీర్చాలని నిర్ణయం తీసుకున్నాం. మేము గంజాయి అమ్మడానికి గోవా బయలుదేరాం. మా నాన్న డి.ఎస్.పి కావడంతో ఆయన కారు వేసుకుని వెళ్లాం పక్కా ప్లాన్ చేసుకొని మహబూబూనగర్, కర్ణాటక, గోవా బార్డర్లు దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకువచ్చాము. వాటితో మా ఫ్రెండ్ అప్పులన్నీ తీర్చేశాం.

కానీ ఒకవేళ మేము అప్పుడు పోలీసుల‌కి దొరికిపోతే మా పరిస్థితి ఏంటి? అని చాలాసార్లు ఆలోచించా. నా జీవితంలో జరిగిన ఈ సంఘటనని ఓ సినిమాగా చేద్దామని అనుకుంటున్నా… అని చెప్పుకొచ్చాడు. కాగా కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందించిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవి కూడా డ్రగ్ డీలర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం.

Exit mobile version