నల్గొండ కాంగ్రెస్ నేతలు బలిసి కొట్టుకుంటున్నారు: కేటీఆర్

  • Publish Date - November 14, 2023 / 03:29 PM IST

– కోమటిరెడ్డి సోదరులకు గుణపాఠం తప్పదు

– డబ్బుతో పరిపాలన కొనలేరు

– చిట్యాల రోడ్ షోలో మంత్రి కేటీఆర్

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: జిల్లా కాంగ్రెస్ నాయకులు టీవీల్లో బలిసి కొట్టుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిట్యాల పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లె మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బులతో మెడిసిపడుతున్నారని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గోస తీసిన సంగతి యాది మరవొద్దన్నారు. మూడోసారి కేసీఆర్ గెలిస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుందని, తెల్ల కార్డు ఉంటే కేసీఆర్ బీమా ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు బీమా లేకున్నా కేసీఆర్ బీమా వస్తుందన్న ఆయన, అన్నపూర్ణ స్కీం కింద పేదలకు సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. వండి పెట్టడం మూతి తూర్చడం తప్ప కేసీఆర్ మొత్తం ఇస్తాడని ప్రజలంతా మూడోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. ప్రతి ఆడబిడ్డకు నెలకు 3వేలు, డిసెంబర్ 3 తర్వాత రైతుబంధు 16వేలు వస్తదన్నారు. నకిరేకల్ లో రైతుబంధుకు 1000 కోట్లు ఇచ్చామని, చిరుమర్తి లింగయ్యను గెలిపిస్తే చిట్యాలలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తామన్నారు.


చిట్యాలలో ఫ్లైఓవర్, బ్రాహ్మణ వెల్లంల పూర్తి కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. ఉదయ సముద్రం పిల్లాయపల్లి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే ముఖ్యమంత్రి ఎవడో తెలియదని ఎద్దేవా చేశారు. పోటీలోలేని జానారెడ్డి ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదమన్నారు. డబ్బు మదం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఓటమి తప్పదన్నారు. తెలంగాణలో మూడు గంటల కరెంటు చాలు అంటున్న కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదన్నారు. కోమటిరెడ్డి సోదరులు పంచే డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ కు ఓటు వేయాలని చిరుమర్తి లింగయ్యను గెలిపించాలని కోరారు. రౌడీ రాజకీయాలను పెంచి పోషించే కోమటిరెడ్డి బ్రదర్స్ కు బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, గుత్తా అమిత్, బాలరాజు యాదవ్ పాల్గొన్నారు.