విధాత, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంట్రాక్టర్ బలుపుకు, మునుగోడు ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇది అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. మునుగోడులో తమకు 30 శాతం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రెండు, మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి తన పదవిని ఫణంగా పెట్టి, బీజేపీకి అమ్ముడు పోయిండని ధ్వజమెత్తారు. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాతనే ఆయన బీజేపీలో చేరిండని తెలిపారు.
ఉప ఎన్నిక కోసం రాజగోపాల్ రూ. 500 కోట్లు ఖర్చు పెడుతానని అమిత్ షా ఓ పెద్దమనిషికి చెప్పిండట. ఆ పెద్ద మనిషి తనను కలిసి ఆ విషయాన్ని చెప్పాడని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటుకు రూ. 30 వేలు ఇచ్చి అయినా గెలుస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నాడని కేటీఆర్ తెలిపారు.