- మొన్న కమలాపూర్ నిన్న భూపాలపల్లి రేపు వేలేరు
- గులాబీ పట్టుసడలకుండా తీవ్రయత్నం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేసీఆర్ కుమారుడు బీఆర్ఎస్ నాయకుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక కేంద్రీకరణ చేస్తున్నారా? అనే చర్చ సాగుతుంది.కేటీఆర్ (KTR)తాజా కేంద్రీకరణ పర్యటనలను పరిశీలిస్తున్న రాజకీయ వర్గాలు, ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే ఈ అంశాన్ని చర్చిస్తున్నారు.
(State wide)రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాలలో కూడా పర్యటనలు చేపడుతున్నప్పటికీ వరంగల్ జిల్లా పై కొంత కేంద్రీకరించి ముందుకు సాగుతున్నట్లు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున అధికార పార్టీలో కీలక నేతగా, రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రిగా ఈ శ్రద్ధ కనబరుస్తున్నట్లు భావిస్తున్నప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా పై పట్టు కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విమర్శకులు చెబుతున్నారు.
ఓరుగల్లులో వరుస పర్యటనలు
ఈ మధ్య స్వల్ప వ్యవధిలోనే రెండు నియోజకవర్గాలు (Kamalapur)కమలాపూర్, భూపాలపల్లిలో కేటీఆర్ అధికారికంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొన్ని శంకుస్థాపనలు చేశారు. మరికొన్ని హామీలు కూడా ఇచ్చారు. గత నెల ప్రారంభంలో హనుమకొండ జిల్లా కమలాపూర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు. ముఖ్యంగా గత తన సహచరుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈటెల టార్గెట్‌గా కేటీఆర్ పర్యటన
ఈటెల టార్గెట్‌గా కేటీఆర్ ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా జమ్మికుంటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేటీఆర్ పర్యటన అనంతరం నియోజకవర్గంలో గులాబీలు జోరు పెరిగిన విషయం తెలిసిందే. 23వ తేదీన భూపాల్ పల్లి (BHUPALPALLY) జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా భారీ స్థాయి బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్, బీజేపీ రాజకీయ పార్టీలపై విమర్శలు చేశారు.
తాజాగా 27వ తేదీన స్టేషన్గన్పూర్ నియోజకవర్గం వేలేరు మండలంలో భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి రాక సందర్భంగా జిల్లా మంత్రులు ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కలెక్టర్ సిక్తా పటేల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాటు పరిశీలించారు. వరుస పర్యటనలతో కేటీఆర్ జిల్లాపై పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆరు జిల్లాలు 12 సెగ్మెంట్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఆరు కొత్త జిల్లాలు ఉన్నాయి. జనగామ, హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల పరిధిలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
ఈ 12 సెగ్మెంట్లలో ఒక్క ములుగు అసెంబ్లీ తప్ప అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఒక్కో సెగ్మెంట్ వారీగా దృష్టిని పెట్టి మరి అక్కడ గులాబీ పార్టీ అధిపత్యం పడిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు తీసుకుంటున్నట్లు అనుకుంటున్నారు.
జన సమీకరణతో బల ప్రదర్శన
(ASSEMBLY)అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఆరంభ, ప్రారంభాలకే పరిమితం కాకుండా భారీ బహిరంగ సభలను ప్రణాళిక బద్దంగా నిర్వహిస్తూ జన సమీకరణ సాక్షిగా విపక్ష రాజకీయాలపై విరుచుకపడుతున్నారు. మొత్తం ఈ వ్యవహారాలను పరిశీలిస్తే ఎన్నికల ప్రచార సభలను తలపిస్తున్నాయి.
బావాబామ్మర్ది జోడు గుర్రాల స్వారీ
(CM)ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల జాతీయ రాజకీయాలపై దృష్టి మరల్చిన నేపథ్యంలో జిల్లాలపై బావా బామ్మర్దులు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్,హరీష్ రావులు వంతుల వారీగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. తమ శాఖపరమైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేస్తున్నారు.
పనిలో పని ఇతర శాఖల అభివృద్ధి పనులను కూడా సంబంధిత మంత్రులను పిలిచి మరీ వారి సమక్షంలోనే ప్రారంభిస్తున్న తీరు మనం గమనించవచ్చు. ఒక విధంగా కేటీఆర్ ముఖ్యమైనమంత్రిగా, అనధికారికంగా మంత్రులకే మంత్రిగా, పార్టీ అధినేత కేసిఆర్ తర్వాత తనదే బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్న విషయం బహిరంగ సత్యమే.
కేటీఆర్ రాక సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ చేస్తున్న హడావుడి, స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు ఈ పర్యటనకు ఇస్తున్న ప్రాధాన్యత కేటీఆర్‌కు ఉన్న ప్రాముఖ్యత తెలియజేస్తుంది.
అదే స్థాయిలో అధికారుల హంగామా కూడా కనిపిస్తోంది పైగా కేటీఆర్ పర్యటనలన్నీ హెలికాప్టర్ తో సాగుతున్నందున మరో హంగు తోడయ్యింది. ఈ స్థాయిలో హరీష్ రావు కార్యక్రమాలు లేకున్నప్పటికీ కేటీఆర్ తర్వాత ప్రాధాన్యత హరీష్ రావు కే లభిస్తోంది.