విధాత: చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డుని రాశారు. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్, ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తన స్వహస్తాలతో రాసిన ఈ పోస్ట్ కార్డును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ చేనేత కార్మికులకు సంబంధించిన పలు అంశాలను ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఇప్పటికే చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్న కేటీఆర్, వాటిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.
చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేసిందని విమర్శించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనే అన్నారు.
ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్బర్ భారత్, గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లే వేసే కేంద్ర ప్రభుత్వం… తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగంలో కీలకమైన నేత కార్మికులను మానవీయ దృక్పథంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ఒక సాంస్కృతి సారథులుగా పరిగణించి చేనేతపైన వెంటనే పన్నును రద్దు చేయాలని కోరారు.