- ఉస్మానియా యూనివర్సిటీలో రెండు వర్గాలుగా చీలిపోయిన విద్యార్థులు
- కేటీఆర్‌ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఒక వర్గం
- యూనివర్సిటీకి రేవంత్‌రెడ్డి వస్తే తరిమి కొడతామంటున్న మరో వర్గం
- పోటా పోటి సమావేశాలు
- ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఈనెల 24, 25 తేదీల్లో దీక్ష
- ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్
ఉస్మానియూ యూనివర్సిటీలో విద్యార్థులు రెండు వర్గాలుగా చీలారు. టీఎస్పీస్సీ పేపర్ లీకేజీలో ఒక వర్గం మంత్రి కేటీఆర్‌ను బాధ్యుడిగా చేస్తూ భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఈనెల 24,25 తేదీలలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరుద్యోగ మహా నిరసన దీక్షకు పిలుపు ఇచ్చాయి. ఈ మహా ధర్నాకు రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తున్నాయి.కాగా ప్రభుత్వ అనుకూల విద్యార్థులు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే తరిమి కొడతామన్నారు. ఇలా రెండు వర్గాలుగా చీలిపోయిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం పోటా పోటీగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన ప్రదర్శనలు, మీడియా సమావేశాలు నిర్వహించారు.
విధాత: టీఎస్పీస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజ్‌లో సంబంధం ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ను తక్షణమే మంత్రివర్గం నుండి బహిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 24, 25 తేదీల్లో మధాహ్నం 1 గంటకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ మహా నిరసన దీక్షను జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చాయి. ఈ మేరకు మంగళవారం యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల నిరసన ప్రదర్శన నిర్వహించి నిరుద్యోగ మహా నిరసన దీక్ష పోస్టర్‌ను విడుదల చేశాయి.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. TSPSC ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో 9 మంది సామాన్యమైన నిందితులను అరెస్ట్ చేయటం కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టుందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
లీకేజీతో సంబంధం ఉన్నరాబంధులను అరెస్ట్ చేసి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. టీఎస్పీస్సీ (TSPSC) చైర్మన్‌తో పాటు సభ్యులు, సెక్రెటరీలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్థులకి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిచాలని ఈ సందర్భంగా ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం ఓయూకు వచ్చే రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలని చూస్తే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు నిరుద్యోగుల చేతిలో చెప్పు దెబ్బలు తింటారని ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. ఏ తప్పు చేయకుంటే దమ్ముంటే ఐటీ మంత్రి కేటీఆర్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్దకి వచ్చి క్షేమంగా పోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు ఈ సందర్భంగా సవాల్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతలు కోటూరి మానవతారాయ్, కోట శ్రీనివాస్ గౌడ్, దుర్గం భాస్కర్, బాల లక్ష్మీ, కేతూరి వెంకటేష్, కొప్పుల ప్రతాపరెడ్డి, శరత్ నాయక్, ఈశ్వర్ లాల్, సుబ్బునాయక్, భిక్షపతి నాయక్, నిరంజన్ యాదవ్, మిడతనపల్లి విజయ్, బొనగాల నరేష్, మదన్, రమేష్ రాథోడ్, భీమ్ రావ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
యూనివర్సిటీకి వస్తే రేవంత్‌రెడ్డిని అడ్డకుంటం: గెల్లు శ్రీనివాస్
ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్‌రెడ్డి వస్తే తరిమి కొడతామని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఓయూ క్యాంపస్‌లోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీ పై ప్రభుత్వం మీద రేవంత్‌రెడ్డి నిరారోపణమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. పేపర్ లీకేజీలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని, అందుకే సిట్ విచారణ జరగకుండా నిందితుడు రాజశేఖర్ రెడ్డి భార్యతో కోర్టులో కేసు వేయించాడని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగ వ్యతిరేక నాయకులని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మందల భాస్కర్ , వీరబాబు, తొట్ల స్వామి , తుంగ బాలు , కడారి స్వామి, కిరణ్ గౌడ్ , రఘురాం, హరిబాబు, శిగా వెంకట్, చటారి దశరథ్, నవీన్ గౌడ్ , కృష్ణ , రమేష్ గౌడ్ , నాగేందర్ రావు , అవినాష్లతో పాటు వివిధ సంఘాల విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
#TSPSC పేపర్ లీక్ పై
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు @revanth_anumula వ్యాఖ్యలను ఖండిస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఈ రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణంలో లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. @BRSparty pic.twitter.com/fTYLVKzWO7— Gellu Srinivas Yadav (@GelluSrinuTRS) March 21, 2023