విధాత, హైదరాబాద్: తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ అని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతి అని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. రాష్ట్రానికి వరం కాళేశ్వరం అయితే దేశానికి శనిశ్వరం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రేవంత్, రాహుల్ వీళ్ళిద్దరూ ఎగేసికొని పోయి కాళేశ్వరం చూసి వచ్చారన్నారు. మహా ఇంజనీర్లు వీళ్ళు బ్రిడ్జి కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారన్నారు. ఎక్ష్పాన్షన్ జాయింట్ (expansion joint) ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుందంటూ ఫోటోలు పెడుతున్నారని, ఇది వీళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. జనాన్ని ఆగం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ లోని కొందరు చిల్లర గాళ్ళు బయలు దేరారన్నారు. రాహుల్ గాంధీ కి చరిత్ర తెల్వదు, తెలుసుకునే సోయి లేదన్నారు. స్క్రిప్ట్ అన్న మార్చుకో,లేదా స్క్రిప్ట్ రైటర్ నన్న మార్చుకో రాహుల్ కి కేటీఆర్ సూచన చేశారు. కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేసిందన్నారు.
దావూద్ ఇబ్రహిం , శోభరాజ్‌లకంటే డేంజర్
దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ గాడు మీ రేవంత్ రెడ్డి అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడు.. బ్లాక్ మెయిలర్, నోటు ఓటు దొంగ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్ల గొడ్లను అమ్మినట్టు అమ్ముకున్న రేవంత్ అలియాస్ రేటెంత రెడ్డి ని పక్కన పెట్టుకుని మాట్లాడడం దేశంలో అతిపెద్ద వింత అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని దేశంలో ఎవ్వరిని అడిగిన చెప్తారన్నారు. ఆదర్శ్, బోఫోర్స్, కామన్ వెల్త్, స్పెక్ట్రం, బొగ్గు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో సహజ వనరులన్నీ దోచుకున్న దొంగలు మీరన్నారు. పంచ భూతాలను.. ఆకాశాన్ని, పాతాలన్ని మింగిన అవినీతి తిమింగాలాలు మీరన్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రధాన మంత్రులు మీ పార్టీ వాళ్ళు అవినీతి ఆరోపణలతో జైల్లో ఊచలు లెక్కబెట్టారన్నారు. పార్టీ పేపర్ లో నేషనల్ హెరాల్డ్ లో కూడా అవినీతికి పాల్పడి సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొన్న మీరు నీతి, నిజాయితీ అంటే జనం నవ్వుకుంటున్నారన్నారు.
కాళేశ్వరం గురించి మీ పక్కన ఉన్న సన్నాసులు చెప్పిన సొల్లు కాకుండా అసలు విషయాలు తెలుసుకోని మాట్లడాలని రాహుల్‌కు కేటీఆర్ హితవు పలికారు. ఖర్చు చేసింది రూ. 80 వేల కోట్లైతే లక్ష కోట్ల అవినీతి ఎక్కడరా వెదవళ్ళారా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందంటే దొట్లో కట్టెయ్యమని ఒకడు.. జున్నుపాలు తెమ్మని ఒకడు.. దూడ బాగుందా ఒకడు అంటున్నారన్నారు. సన్నాసుల్లారా… మీరు 2008 లో వేసిన ప్రాణహిత అంచనా 40 వేల కోట్లు అందులో రిజర్వాయర్లు లేవు. కాలువలకు, పంపు హౌసు లకే అంత పెట్టారు. మరి 15 ఏళ్ల తర్వాత అంచనాలు పెరగవా అని అడిగారు. మీ హయం లో మానకొండూరు లో సాగునీరు లేక ఎస్సార్ ఎస్పీ కాలువల్లో క్రికెట్ ఆడుకునే వాళ్ళమన్నారు.
శబరి,ప్రాణహిత గోదావరిలో కలిసే చోట మేడిగడ్డ వద్ద..
ప్రాణహిత నది లో నీటి లభ్యత తక్కువ ఉందని ఎలాంటి కరువు వచ్చిన తెలంగాణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని.. శబరి, ప్రాణహిత, గోదావరి కలిసే ప్రాంతంలో. కేసీఆర్ మేడిగడ్డకు అంకురార్పణ చేశారన్నారు. తమ్మిడిహట్టి నుంచి నీరు ఎల్లంపల్లి కి వచ్చే బదులు ఎక్కువ నీటిని మేడిగడ్డ నుంచి తెచ్చే విధంగా ప్రాజెక్టు రూపొందించారని తెలిపారు. తెలంగాణ జాతి సంపద కాలేశ్వరం ప్రాజెక్టు అని అన్న కేటీఆర్ ఎల్లంపల్లి నుంచి మిగతా ప్రాజెక్టు యధావిధిగానే ఉంది కదా అని అన్నారు.
50 టీఎంసీ లు మల్లన్న సాగర్, 3 టీఎంసీ లు రంగనాయక్ సాగర్, 12 టీఎంసీ లు కొండపోచమ్మ సాగర్ ఇంకా గందమల్ల ఇలా అనేక రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, భారీ పంపు హౌస్ లు నిర్మించామని కేటీఆర్ తెలిపారు. సుందిళ్ళ, అన్నారం, మెడిగడ్డ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, గందమల్ల ఇలా దాదాపు 10 కొత్త జలాశయాలు నిర్మించడంతో.. ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అతిపెద్ద దాన్యగారంగా తయారైందన్నారు.