Site icon vidhaatha

పాతగుట్టలో నారసింహుడికి సింహవాహన సేవ.. ఎదుర్కోలు

విధాత, యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి హవనం, అలంకార సింహవాహన సేవలు నిర్వహించారు. పాంచారాత్రాగమ శాస్త్రానుసారం వేదపండితులు స్వామివారికి విశేష అలంకార, వాహన సేవలు నిర్వహించగా సింహ రూపుడైన నారసింహుడిని సింహవాహనంపై దర్శించుకుని భక్తులు పులకించారు.

సాయంత్రం హవనం పిదప స్వామి వారికి అశ్వవాహన అలంకార సేవ నిర్వహించనున్నారు. అశ్వవాహనరూఢుడైన నారసింహుడికి, లక్ష్మి అమ్మవార్లకు ఎదుర్కోలు ఘట్టం నిర్వహిస్తారు. వధూవరులైన స్తంభోద్భవుడు నరసింహుడి, క్షీర సాగర తనయ లక్ష్మి అమ్మవారి గుణ గణాలను వర్ణిస్తూ సాగే ఎదుర్కోలు ఘట్టం భక్తులను అలరించనుంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం హవనం, తిరుమంజనోత్సవం, హనుమంత వాహన అలంకార సేవ, సాయంత్రం 7గంటలకు లక్ష్మీ నరసింహుల తిరు కల్యాణోత్సవం, గజావాహన సేవలు నిర్వహించనున్నారు.

Exit mobile version