Site icon vidhaatha

Maharashtra | మహారాష్ట్రలో అర్ధరాత్రి ఘోరం.. కూలిన క్రేన్‌.. 16 మంది కార్మికుల దుర్మరణం

Maharashtra |

మహారాష్ట్రలోని థానేలోని షాహాపూర్‌లో నిర్మాణ స్థలంలో సోమవారం అర్ధరాత్రి క్రేన్‌ కూలిపోయింది. ఈ ఘటనలో 16 మంది కార్మికులు దుర్మరణం చెందారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో పని చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి క్రేన్‌ కూలగా.. కార్మికులు నలిగిపోయారు. మరో ముగ్గురు గాయపడగా.. వారిని సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురి క్రేన్‌ శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ పిల్లర్‌పై గిడ్డర్‌ యంత్రాన్ని ఫేజ్‌-3 నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో అది కూలిపోయినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. గడ్డర్‌ను భారీ హైవేలు, రైలు వంతెలను నిర్మించేందుకు ఉపయోగిస్తుంటారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున షాపూర్‌లోని సర్లాంబే గ్రామ సమీపంలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ మూడో దశ నిర్మాణం స్థలం వద్ద జరిగిందన్నారు.

సంఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని తెలిపారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ.. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మహారాష్ట్రలో జరిగిన ఘోర దుర్ఘటనతో బాధపడ్డానని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంఘటనా స్థలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని, బాధితులకు సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉండగా.. సమృద్ధి మహామార్గ్‌ను ముంబయి – నాగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేగా పిలుస్తుంటారు. 701 కిలోమీటర్ల పొడవైన సమృద్ధి మహామార్గ్‌ రెండు నగరాలను కలిపేందుకు ప్రధాన రహదారి. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని చేపడుతోంది. ఇందులో మొదటి దశ నాగ్‌పూర్ నుంచి షిర్డీని కలుపుతూ గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ రహదారిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ కలల ప్రాజెక్టుగా చెబుతుంటారు. ఇప్పటికే ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో రెండు దశలు పూర్తయ్యాయి. మే 26న రెండో దశలో భాగంగా నిర్మించిన నాసిక్‌లోని షిర్డీ-భర్వీర్‌ మధ్య నిర్మించిన మార్గాన్ని సీఎం షిండే ప్రారంభించగా.. సమృద్ధి మహామార్గ్‌లో 600 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మూడో విడత పనులు జరుగుతున్నాయి.

Exit mobile version