రేపే మ‌హా శివ‌రాత్రి.. శివ‌య్య నైవేద్యంలో ఉల్లిపాయ‌, వెల్లుల్లి వాడొచ్చా..?

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకునేందుకు శివ భ‌క్తులు సిద్ధ‌మ‌య్యారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాల‌యాల‌న్నీ విద్యుత్ దీపాల‌తో వెలిగిపోతున్నాయి

  • Publish Date - March 7, 2024 / 03:15 PM IST

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకునేందుకు శివ భ‌క్తులు సిద్ధ‌మ‌య్యారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాల‌యాల‌న్నీ విద్యుత్ దీపాల‌తో వెలిగిపోతున్నాయి. శివ నామ‌స్మ‌ర‌ణ‌ల‌తో మార్మోగిపోతున్నాయి. మార్చి 8వ తేదీన శివ‌రాత్రి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు భ‌క్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మ‌హా శివ‌రాత్రి రోజున శివ‌య్య భ‌క్తులు ఉప‌వాస దీక్ష చేప‌డుతారు. క‌నీసం మంచినీళ్ల‌ను తాగ‌రు. ఆహారం కూడా ముట్టుకోరు. సాయంత్రం వేళ శివాల‌యం సంద‌ర్శించిన త‌ర్వాత ఉప‌వాస దీక్ష విర‌మిస్తారు.

ఇక శివుడికి ర‌క‌ర‌కాల నైవేద్యాల‌ను కూడా త‌యారు చేస్తారు. అయితే నైవేద్యం, ప్ర‌సాదంగా చేసే ఏ వంట‌కాల్లోనూ ఉల్లిపాయ‌, వెల్లుల్లి వాడ‌కూడ‌దు. ఈ రెండింటిని వాడ‌కూడ‌దు అని పండితులు చెబుతున్నారు. శివ‌య్య‌కు ఇష్ట‌మైన విధంగానే నైవేద్యం, ప్ర‌సాదం స‌మ‌ర్పించి త‌మ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌ను చాటుకోవాల‌ని పండితులు సూచిస్తున్నారు. మ‌రి శివ‌య్య‌కు ఎలాంటి నైవేద్యం ఇష్టం, వాటిని ఎలా త‌యారు చేయాలో తెలుసుకుందాం..

పంచామృతం : మ‌హా శివ‌రాత్రి రోజున శివుడిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి పంచామృతం త‌యారు చేసి నైవేద్యంగా స‌మ‌ర్పిస్తుంటారు. పెరుగు, పాలు, నీరు, నెయ్యి, తేనెను ఉప‌యోగించి పంచామృతాన్ని త‌యారు చేస్తారు. ఇక ఈ పంచామృతాన్ని బాగా క‌లిపి శివ‌య్య‌కు నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. అనంత‌రం భ‌క్తులు కూడా సేవిస్తారు.

ఖీర్ : శివ‌రాత్రి ప‌ర్వ‌దినం రోజున ఖీర్‌ను ఆ ప‌ర‌మేశ్వ‌రుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా వంటి వాటిని స‌న్న‌గా త‌ర‌గాలి. ఆ త‌ర్వాత వాటి మిశ్ర‌మాన్ని నెయ్యిలో వేయించాలి. అనంత‌రం వాటిని పాల‌ల్లో వేసి ఉడికించి, స్వామి వారికి భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో స‌మ‌ర్పించాలి. ఈ మిశ్రమంలో చ‌క్కెర వేయాల్సిన అవ‌స‌రం లేదు.

శ్రీఖండ్ : ఇది మహా శివుడికి ఇష్ట‌మైన ప్ర‌సాదంగా పండితులు చెబుతుంటారు. ఓ కాట‌న్ క్లాత్‌లో రెండు క‌ప్పుల పెరుగు వేసి.. దానిని గ‌ట్టిగా ముడి వేయాలి. ఇక పెరుగులో ఉన్న నీరు కింద‌కు పోయేలా ఆ గుడ్డ‌ను వేలాడ‌దీయాలి. పెరుగు పూర్తిగా డ్రై అయిన త‌ర్వాత‌.. దాంట్లో కుంకుమ పువ్వు, పాలు క‌లిపిన మిశ్ర‌మాన్ని వేయాలి. చ‌క్కెర‌, యాల‌కుల పొడి వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి నైవేద్యంగా పెట్టాలి. మ‌హాశివుడిని ప్ర‌స‌న్నం చేసుకోవడానికి ఈ నైవేద్యం మంచి మార్గ‌మ‌ని పండితులు చెబుతున్నారు.

Latest News