విధాత, నల్గొండ: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం రాముని తండాలో ఓ యువకుడి ఆత్మహత్య నేపథ్యంలో తండావాసులు ఇద్దరు మహిళలకు శిరోముండనం చేసిన ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజు(17) ఈ నెల14న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు రాజు అంత్యక్రియల అనంతరం అతడి ఫోన్ తనిఖీ చేయగా తండాకు చెందిన ఇద్దరు మహిళలతో అతను చేసిన సంభాషణలు బయటపడ్డాయి. దీంతో రాజు మృతికి సదరు ఇద్దరు మహిళలే కారణమని ఆరోపిస్తూ శనివారం తండా పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.
రాజు ఆత్మహత్యకు తమకు సంబంధం లేదని మొత్తుకున్నా గ్రామ సర్పంచ్, పంచాయతీ పెద్దలు వినిపించుకోలేదు. పంచాయతీ సందర్భంగా ఆవేశానికి లోనైన తండావాసులు వారిని వ్యభిచారులని నిందిస్తు విపరీతంగా కొట్టి ఆ ఇద్దరు మహిళలకు శిరోముండనం చేశారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుల బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఆలస్యంగా సమాచారం అందుకున్న దేవరకొండ డివిజన్ పోలీసులు తండాకు వెళ్లగా ఇది తమ గ్రామ ఆచారామంటు వారిని వెనక్కి పంపించేశారు. ఈ వివాదంపై ప్రస్తుతానికి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.