- శివసత్తుల పూనకంతో హోరెత్తిన ఐలోని
- ప్రభబండ్లూ..పట్నాలూ.. ఒగ్గుడోలుమోత
- రాజకీయ భక్తుల హడావుడి
విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఐలోని మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తజనం పోటెత్తింది. రెండో రోజు శనివారం శివసత్తుల పూనకాలు, భక్తుల రద్దీతో జాతర హోరెత్తింది. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, విఐపిల తాకిడి బాగా పెరిగింది. భక్తజనం రాక, హడావుడితో జాతర సర్వరంగులు సంతరించుకుంది. సామాన్య భక్తులకు కొంత ఇబ్బంది నెలకొంది.
సంక్రాంతి పండుగ వేడుకల సందర్భంగా దేవాలయంలో సందడి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో మల్లికార్జున స్వామి పట్నాలు, ప్రభన్లు ఊరేగింపు, ఒగ్గుడోలు చప్పుల్లతో ఆలయ ప్రాంగణమంతా మల్లికార్జున స్వామి నామస్వరలతో మారుమోగాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జాతరలో నాయకుల సందడి
బ్రహ్మోత్సవాలల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, డిసిబి చైర్మన్ మారినేని రవీందర్ రావు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు.కొందరు దంపతులు, అనుచరులు, పార్టీ నాయకులతో తరలివచ్చారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఎర్రబెల్లి
ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు ఆహుతులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఈ పండుగ రోజు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
ఆకర్షణీయంగా స్టాళ్ళు
ఆలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్యశాఖ ఎక్సైజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ టూరిజం తదితర శాఖలో నుండి సేవా కార్యక్రమాలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ఆలయ సిబ్బంది నూతనంగా ఎన్నిక కాబడిన అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.