Site icon vidhaatha

మల్లికార్జున్ ఖర్గే రాజీనామా

విధాత‌, ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ పడుతున్న మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఆ పార్టీ మేధోమథనం సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి ఆయన కట్టుబడ్డారు.

‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ ఉండాలని కాంగ్రెస్ చేసిన తీర్మానానికికు విధేయత చూపారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఖర్గే రాసిన లేఖలో, తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నందువల్ల రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేత పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

అంతకుముందు ఈ పదవిని గులాం నబీ ఆజాద్ నిర్వహించే వారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత 2021 ఫిబ్రవరిలో ఖర్గే ఈ పదవిని చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబరు 17న ఎన్నికలు జరుగుతాయి. ఈ ఫలితాలను వెల్లడించిన తర్వాత మాత్రమే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి ఎంపిక కసరత్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయితే.. ఖర్గే వారసునిగా ఎంపిక కాగలిగినవారిలో దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, రంజిత్ రంజన్ ఉన్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ నుంచి తప్పుకోవడంతోపాటు హిందీ రాష్ట్రాలకు చెందినవారు కావడం ప్లస్ పాయింట్ అవుతోందని అంటున్నాయి. గుజరాత్‌కు చెందిన శక్తి సింహ్ గోహిల్ పేరు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి.

Exit mobile version