Wedding Gift |
విధాత: తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటున్న ప్రియురాలిపై ఓ యువకుడు కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని ప్రియురాలు మరొకరికి దక్కొద్దనే ఉద్దేశంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పెళ్లికి బహుమతిగా బాంబులు అమర్చిన హోం థియేటర్ (Home Theater)ను ఇచ్చాడు.
పెళ్లి అయిపోయిన తర్వాత.. హోం థియేటర్‌ను ఇంట్లో అమర్చి స్విచ్ ఆన్ చేయగా అది పేలిపోయింది. దీంతో ప్రియురాలి భర్త, అతని అన్న ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రియురాలు మాత్రం క్షేమంగా బయటపడింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని కబీర్‌ధామ్ జిల్లా(Kabirdham district)లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కబీర్‌ధామ్ జిల్లాకు చెందిన సర్జు అనే యువకుడు గత కొన్నేండ్ల నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెకు ఇటీవలే మరొకరితో పెళ్లి ఖాయమైంది. తనను పెళ్లి చేసుకోవాలని సర్జు అడిగినప్పటికీ ఆమె తిరస్కరించింది. తనకు దక్కని ఆమె మరెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.
ఇక ప్రియురాలి పెళ్లి రోజున సర్జు ఆమెకు హోం థియేటర్ బహుమతిగా ఇచ్చాడు. పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత పెళ్లి కుమారుడు హేమేంద్ర మిరావై(22) ఆ హోం థియేటర్‌ను ఇంట్లో అమర్చి స్విచ్ ఆన్ చేశాడు. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది.
వరుడు అక్కడికక్కడే చనిపోగా, అతని సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి ఇంటి గోడతో పాటు పై కప్పు కూడా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పెళ్లికి ఎవరు ఏ బహుమతులు ఇచ్చారన్న కోణంలో పోలీసులు విచారించారు. హోం థియేటర్ గిఫ్ట్‌గా ఇచ్చిన సర్జును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనను పెళ్లి చేసుకోలేదని ఉద్దేశంతోనే హోం థియేటర్‌లో బాంబులు అమర్చి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో సర్జు అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.