విధాత: టీఆర్ఎస్, బీజేపీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం, పలివెల, ఊకొండి గ్రామాల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి రోడ్ షో నిర్వహించారు. టీఆర్‌ఎస్, బీజేపీని బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నరని. అమిత్ షా ఆదేశాలతో సీఆర్పీఎఫ్ దిగబోతోందని పేర్కొన్నారు.
బీజేపీ కోసం సీఆర్పీఎఫ్, టీఆర్ఎస్ కోసం రాష్ట్ర పోలీసులు పని చేయబోతున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలు ఒక అలజడి సృష్టించాలని ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఈ రెండు పార్టీల మధ్య పోలరైజేషన్‌కు కుట్ర పన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
బ్యాలెట్‌లో పేర్లు పొందు పరిచే విషయంలో.. మునుగోడు రిటర్నింగ్ అధికారి నాలుగో స్థానంలో ఉండాల్సిన టీఆర్ఎస్‌ను రెండో స్థానంలో ఉంచారని ఆరోపించారు. జాతీయ పార్టీల అభ్యర్థులు ముందుంచి ఆ తరువాత ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు పెట్టాలని తెలిపారు.
టీఆర్‌ఎస్ ఇంకా జాతీయ పార్టీ కాలేదని.. అభ్యర్థి టీఆరెస్ తరపునే నామినేషన్ వేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బ్యాలెట్ పేపర్‌పై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పేపర్‌ను పరిశీలించి మార్పు చేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం సీరియల్ నంబర్ కేటాయించాలని చెప్పారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ముందు కూడా రఘునందన్, ఈటెలను ఉరేయబోతున్నట్టు హడావుడి చేశారని చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరు గెలిచాక వాళ్లపై కేసులు కాకులెత్తుకెళ్లాయని తెలిపారు. మునుగోడులో సైతం ఆ ఇద్దరి మధ్యనే పోలరైజేషన్ కోసం ఇద్దరు కలిసే ఉద్రిక్తతలు సృష్టించి కుట్ర చేయబోతున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు, మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ కుట్రను తిప్పి కొట్టాలని రేవంత్ రెడ్డి సృష్టించారు.
ఖర్గే ఘన విజయంపై రేవంత్ రెడ్డి హర్షం
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత ప్రజాస్వామికంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారని, ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.