‘మాస్టర్‌’ప్లాన్ అసలు రంగేంటీ? మొన్న వరంగల్.. నేడు కామారెడ్డి.. రేపు జగిత్యాల!

'అధికార' చ‌క్రబంధంలో భూములు పప్పులుడకవని తిప్పికొట్టిన రైతులు వాస్తవ విరుద్ధ ప్రభుత్వ ప్రణాళికలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అర్బన్ డెవలప్మెంట్ కోసం అధికార గులాబీ పార్టీ అధిష్టానం కనుసన్నల్లో రూపొందుతున్న మాస్టర్ ప్లాన్లు ఎదురు తిరుగుతున్నాయి. అభివృద్ధి జపం చేస్తూ అంతర్గతంగా ఫక్తు రియల్టర్లుగా మారిన గులాబీ పార్టీ నేతల అంతర్గత ప్రణాళికలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అందుకు అనుగుణంగా అడుగులేస్తున్న అధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసే పట్టణాల చుట్టు పక్కల రైతులు […]

  • Publish Date - January 20, 2023 / 01:36 PM IST
  • ‘అధికార’ చ‌క్రబంధంలో భూములు
  • పప్పులుడకవని తిప్పికొట్టిన రైతులు
  • వాస్తవ విరుద్ధ ప్రభుత్వ ప్రణాళికలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అర్బన్ డెవలప్మెంట్ కోసం అధికార గులాబీ పార్టీ అధిష్టానం కనుసన్నల్లో రూపొందుతున్న మాస్టర్ ప్లాన్లు ఎదురు తిరుగుతున్నాయి. అభివృద్ధి జపం చేస్తూ అంతర్గతంగా ఫక్తు రియల్టర్లుగా మారిన గులాబీ పార్టీ నేతల అంతర్గత ప్రణాళికలను ప్రజలు తిరస్కరిస్తున్నారు.

అందుకు అనుగుణంగా అడుగులేస్తున్న అధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసే పట్టణాల చుట్టు పక్కల రైతులు తిరుగబడుతున్నారు. అధికార పార్టీ ‘అనుకున్నది ఒకటైతే అయ్యేది మ‌రోటి’ అనే తీరుగా పట్టణాల అభివృద్ధి ప్రణాళికలు ఉంటున్నాయి.

ముందుగా వరంగల్‌లోని రైతులు తిరుగుబాటు జెండా ఎగరేయగా అదే బాటలో కామారెడ్డి రైతులు తిరగబడుతున్నారు. దీని ప్రభావం జగిత్యాల పట్టణ చుట్టుపక్కల రైతులపై పడింది. అక్కడ కూడా రైతులు నిరసన బాటపడుతున్నారు. విశేషమేమిటంటే రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు నిర్వహించడం గమనార్హం.

భారీ ల్యాండ్ పూలింగ్‌కు నిర్ణయం

గత మే నెలలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద నగరంగా పేరొందిన కాకతీయుల రాజధాని వరంగల్ పట్టణాభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రణాళికను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

రైతుల నిరసన దెబ్బకు ప్రభుత్వం పకడ్బందీగా రూపొందించిన రియల్ ఎస్టేట్ ప్లాన్ దెబ్బతిన్నది. ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ చేస్తే నగర విస్తరణ క్రమ పద్ధతిలో ఉండేందుకు అవకాశం లేదని ‘కుడా’ నేతృత్వంలో ముందస్తు ప్రణాళికా ప్రకారం రియల్ ఎస్టేట్ చేయడం వల్ల పట్టణాభివృద్ధి పద్ధతి ప్రకారం జరుగుతుందని నమ్మబలికి ఈ భారీ ల్యాండ్ పూలింగ్‌కు పథకం రూపొందించారు. అయితే ఇది అమలుకు నోచుకోకముందే రద్దు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

21వేల ఎకరాలు… 27 గ్రామాలు

వరంగల్ నగరం చుట్టూ నిర్మిస్తున్న ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా 41 కిలోమీటర్ల పరిధిలో నగరాభివృద్ధి కోసం అంటూ రైతుల నుంచి భూమిని సేకరించి ప్రభుత్వమే కూడా మధ్యవర్తిత్వంతో రియల్ ఎస్టేట్ చేయాలని భావించారు.

ఈ మేరకు భూ సమీకరణ కోసం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో జీవో 81 ద్వారా నోటిఫికేషన్ జారీ చేశారు. వరంగల్ చుట్టూ సుమారు 27 గ్రామాల పరిధిలో 21 వేల ఎకరాల రైతుల భూములను సమీకరించి రియల్ ఎస్టేట్ చేయాలని భావించారు.

ఈ మేరకు నగరం చుట్టూరా ఉన్న నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అంతర్గత భాగస్వామ్యంగా, అధికార పార్టీ అధినేత కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా అధికారికంగా చేపట్టాలని భావించారు. ఈ మేరకు పడ్బందీగా రూపొందించిన పథకం అమలుకు సిద్ధమవుతున్న సమయంలో రైతులు యుద్ధభేరి మోగించారు.

రైతుల తీవ్ర నిరసనలు

రెండు మూడు పంటలు పండే అతి విలువైన భూములను ల్యాండ్ పూలింగు పేరుతో కొట్టేయాలని ప్రభుత్వం భావిస్తుందంటూ రైతులు తీవ్ర నిరసనలు చేపట్టారు. ఆరేపల్లిలో ప్రారంభమైన రైతుల నిరసన, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆవిర్భావానికి దారి తీసి నగరం నలువైపులా రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టి అధికార పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. అసలే వచ్చేవి ఎన్నికలు కావడంతో రైతుల నిరసన ప్రభావం తమపై పడుతుందని భావించిన ఎమ్మెల్యేలు కాస్త వెనక్కి తగ్గారు. ముందుగా భూ సమీకరణను నిలిపివేస్తున్నట్లు ఆగమేఘాల మీద మంత్రి ప్రకటించి రైతులను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అధికార పార్టీ ఆలోచనలు పసిగట్టిన రైతులు జారీ చేసిన జీవో ఉపసంహరించుకునే వరకు పట్టుబట్టి సాధించారు.

కామారెడ్డిలో కథ అడ్డం

వరంగల్ రైతుల బాటలోనే ప్రస్తుతం కామారెడ్డి రైతులు కూడా ముందుకు సాగుతున్నారు. రెండు మూడు పంటలు పండే విలువైన సుమారు 1200 ఎకరాల వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్ జోన్ పేరుతో మాస్టర్ ప్లాన్ లో భాగస్వామ్యం చేయడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం పై కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మునిసిపల్ పాలకవర్గంపై రైతులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ప్లాన్‌ రద్దుకు పాలకవర్గం సిద్ధమైన విషయం తెలిసిందే.

జగిత్యాలలో రైతుల ఆందోళన

కామారెడ్డిలో పరిస్థితి ఇలా ఉంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అబ్బాపూర్ గ్రామ రైతులు జగిత్యాలలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేపట్టారు.

ఐదు గ్రామాల ప్రజలు మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ కూడా రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్ లో చేర్చడమే కారణంగా రైతులు పేర్కొంటున్నారు.

వాస్తవ విరుద్ధ మాస్టర్‌ప్లాన్‌లు

తెలంగాణలోని ముఖ్య పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్లలో ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా లేకపోవడం పట్ల స్థానిక ప్రజలు రైతుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వానికి దూరదృష్టి ఉంటే ఉండొచ్చు గానీ ప్రస్తుత స్థానిక ప్రజల రైతుల జీవనోపాధిని పట్టించుకోకుండా రూపొందించే మాస్టర్ ప్లాన్లను మాత్రం రైతులు మూకుమ్మడిగా తిప్పి కొడుతున్నారు. వీటి నుంచి ప్రభుత్వం పాఠం తీసుకుంటుందా? తమ ప్రయోజనం కోసం తాకట్టు పెడుతుందా? రానున్న రోజుల్లో తేలనుంది.