Site icon vidhaatha

Medak: రైతులకు ఇంకా అందని ‘రైతుబంధు’.. అధికారుల‌పై ‘శేరి’ గ‌రం.. గ‌రం

విధాత, మెదక్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: రైతుబంధు జిల్లాలోని అందరు రైతులకు అందలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెంటనే మండల వ్యవసాయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలని శేరి సుభాష్ రెడ్డి అధికారులకు సూచించారు.

కొన్ని బ్యాంకుల్లో రైతు బంధు, ఫించను డబ్బులను బకాయిల క్రింద జమచేసుకుంటుండం ద్వారా లబ్ధిదారులు, హామీ దారులు ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంకు వారికి తగు ఆదేశాలు జారీ చేయవలసినదిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కోరారు.

మంగళవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో జిల్లా పరిషద్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషద్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో వ్యవసాయం, విద్యుత్, విద్య,ఆరోగ్య, మిషన్ భగీరథ, పంచాయత్ రాజ్, డి.ఆర్.డి.ఓ. శాఖల ప్రగతిని సమీక్షించారు.

అధికారుల‌పై ఎమ్మెల్సీ గ‌రం.. గ‌రం..

రాష్ట్ర ప్రభుత్వం 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమిస్తే వారు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదని, ఇంకా కొంత మంది రైతులకు రైతు బందు డబ్బులు పడలేదని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాలత వివరణ ఇస్తూ బ్యాంక్ ఐడీ మారినందున జిల్లాలో 2879 మంది రైతులకు 22లక్షల,71 వెలు రైతు బంధు అందలేదని చెప్పారు.

ఇంకా రైతుబందు పడని వారి వివరాలను క్లస్టర్ వారీగా వెంటనే అందించాలని సుభాష్ రెడ్డి సూచించారు. జిల్లాలో నర్సాపూర్, వెల్దుర్తి, తూప్రాన్, తదితర ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు భీమాకు సంబంధించి పెండింగులో ఉన్న 121 కేసులకు సంబంధించి కుటుంబ సభ్యులకు డబ్బులు అందేలా చూడాలని సూచించారు.

దీంతో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ రాజర్శి షా హామీ ఇచ్చారు. వెంటనే ఏఈవోలతో సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అధికారుల కుంటి సాకులు..

జిల్లా కేంద్రంలోని మాత, శిశు సంరక్షణ కేంద్రంలో రోగుల వెంట వచ్చిన వారికి నిలువ నీడ లేదని, కాన్పులు అయిన తర్వాత ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తున్నాయని, అదేవిధంగా జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రశ్నించగా రక్తహీనత, ఇమ్మ్యూనీటి కారణంగా ఇన్ఫెక్షన్ వస్తున్నాయని ప్రాథమికంగా గుర్తించి ఇన్ఫెక్షన్ కమిటీ ద్వారా వారం వారం మానిటరింగ్ చేస్తున్నామని, నిమ్స్ ధరల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులలో వివిధ శస్త్ర చికిత్సలు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

కంటి వెలుగు క్రింద జిల్లాలో ఇప్పటి వరకు 2,12,622 మందికి కంటి పరీక్షలు చేసి 22,876 మందికి రీడింగ్ అద్దాలు, 11606 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామని అన్నారు ప్రభుత్వాసుపత్రులలో 83 శాతం మేర ప్రసవాలు చేసి రాష్ట్రంలో అగ్రగామిలో ఉన్నామని, 90 శాతం లక్ష్య సాధన దిశగా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో కోతులు, కుక్కల బెడద అధికంగా ఉందని కొందరు సభ్యులు ప్రశ్నించగా అటవీ శాఖ, పొలిసు చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా పెట్టి వాటి రవాణాకు అడ్డుకట్టకే వేయవలసినదిగా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

ప‌నుల్లో పురోగ‌తి ఉండాలి

పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 641 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి 77 పనులు పూర్తి చేశామని, 129 పనులు పురోగతిలో ఉన్నాయని, ప్రజాప్రతినిధులకు రోడ్ల నిర్మాణంపై సమాచారమిస్తూ వారి సహకారం, భాగ స్వామ్యంతో నాణ్యతగా పనులు చేపట్టాలని, ఎటువంటి ఫిర్యాదులకు తావివ్వవరాదని కలెక్టర్ హెచ్చరించారు.

రోడ్ల నిర్మాణానికి వేసవి కాలం మంచి సమయమని, టెండర్ల ద్వారా తండాలలో సి.సి.రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఎమ్మెల్సీ సూచించారు. అదేవిధంగా ప్రజల నుంచి ఫిర్యాదులు రాకముందే విద్యుత్ సరఫరాకు అవసరమైన ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు.

నిజాంపేటలో పంటల సాగుకు రైతులు పూర్తిగా బోర్లపై ఆధారపడ్డారని, బోర్ కనెక్షన్ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా గుర్తించిన లూజ్ వైర్లు, ఇండ్ల మీదుగా వెళ్లిన విద్యుత్ తీగలు, ఒంగిన స్థంబాలు, ట్రాన్ఫర్మర్లకు కంచెలు ఏర్పాటు వంటి వాటిపై దృష్టికి సారించి పరిష్కరించాలన్నారు.

అదేవిధంగా వివిధ కారణాల వల్ల విద్యుత్ షాక్ తో చనిపోయిన కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని సూచించాగా ఎలక్ట్రికల్ ఆక్సిడెంటల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.

సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి

వేసవి దృష్ట్యా మంచి నీటి ఎద్దడి తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, మనోహరా బాద్, పిల్లికొట్టాల్‌లలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మిషన్ భగీరథ నీటిని అందించవలసినదిగా ఎమ్మల్సీ శేరి సుభాష్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

మన ఊరు మన బడి క్రింద ఎంపిక చేసిన పాఠశాలలోనే గాక ఆడపిల్లలు ఎక్కువగా చదువుతున్న టాయి లెట్స్ లేని పాఠశాలను గుర్తించి శౌచాలయాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ సూచించారు. కాగా మన ఊరి మన బడి క్రింద కోటి రూపాయల లోపు వ్యయం కాగల పనులకు టెండర్లు రానిచో ఎస్.ఎం. సీ కమిటీ తీర్మానం ద్వారా నామినేషన్ పద్దతిలో పనులు చేయడానికి చొరవ చూపాలని, నిధుల కొరత లేదని కలెక్టర్ సభ్యులకు తెలిపారు.

పింఛ‌న్ల‌పై ప్ర‌భుత్వానికి నివేదిక పంపాం: క‌లెక్ట‌ర్ రాజ‌ర్షిషా

వివిధ కారణాలతో ఆగిపోయిన, తిరస్కరణకు గురైన ఫించ‌న్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అన్నారు. ఉపాధి హామీ పధకం క్రింద 1,76,109 జాబ్ కార్డుదారులకు పనులు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై తగు చర్యలు తీసుకొని యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ..

మను ఊరు మనబడి పనులను వేగవంతం చేయాలని అధికరులను ఆదేశించారు. జడ్పిటీసీలు లావణ్య రెడ్డి , కృష్ణారెడ్డి, రమేష్ గౌడ్ ఎంపీపీలు పూజల హరికృష్ణ, శ్రీనివాస్, మన్నె శ్రీనివాస్ తదితరులు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఈ ని ఆదేశించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట శైలేష్, జిల్లా అధికారులు ఆశాకుమారి, చందు నాయక్, చంద్రశేఖర్, రవి ప్రసాద్,యుగంధర్,పాండు రంగారెడ్డి, జానకి రామ్, కమలాకర్, రాధాకిషన్, శ్రీనివాస్ తదితర జిల్లా అధికారులు, జెడ్.పి .టి.సి.లు, ఎంపిపి లు, కో అప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version