Site icon vidhaatha

మెదక్ ఉమ్మడి జిల్లాలో రసవత్తర రాజకీయం.. BRSలో అసమ్మతి సెగలు

విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: సరిగ్గా ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుండే రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ నియోజక వర్గాల్లో పార్టీలను బలోపేతం చేసుకుంటున్నాయి. గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

మెదక్ ఉమ్మడి జిల్లాల్లో 10 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో 10లో 9 బీఆర్ ఎస్ పార్టీ గెలుపొందింది. సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలలో బీజేపి అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు , సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతపై పోటీ చేసి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

కర్ణుని చావుకు 100 కారణాలు అన్నట్లూ ఈ ఎన్నికకు సంబంధించి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు అధికార బీఆర్ ఎస్ పార్టీపై ఆగ్రహం ఒక కారణం ఐతే.. సీఎం కెసిఆర్ దుబ్బాకలో సభ నిర్వహించ క పోవడం, అప్పటి సీపీ జోయల్ డే వీస్ అత్యుత్సాహం టిఆర్ఎస్ పార్టీ కొంప ముంచింది. ఉప ఎన్నికల్లో చక్రం తిప్పే హరీష్ రావు ఈ ఎన్నికలో పార్టీలో ఉన్న అసంతృప్తులను కనిపెట్టడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు.

ప్రస్తుత ఎంపీ సిద్దిపేట బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం లో 119 ఓట్లు బీజేపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉండడం, దుబ్బాక మండలంలో 3000 పై చిలుకు ఓట్లు బీజేపీ అభ్యర్థికి రావడం బీఆర్ ఎస్ పార్టీ అంతర్గత కలహాలను బయట పెట్టింది. ఓటమి చెందినా పార్టీ పరిస్థితిలో మార్పు రాలేదు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సతీష్ రెడ్డి పార్టీ టికెట్ కోసం ఇప్పటి నుండే పోటీ పడుతున్నారు. ప్రస్తుతం సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో మినహా అన్నినియోజక వర్గాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది.

మెదక్: పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు..

మెదక్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సీఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్ రెడ్డి మధ్య పచ్ఛ గడ్డివెస్తే భగ్గు మనే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఈ ఇద్దరి నేతల తీరుతో అధికారులు నలిగి పోతున్నారు.

నిజాంపేట్ జడ్పీటీసీ విజయ్ కుమార్, పాపన్నపేట్ ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, కొందరు సర్పంచులు, ప్రజాప్రతినిధులు సుభాష్ రెడ్డికి మద్దతుగా కొనసాగుతున్నారు. 2001 నుండి పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పై గుర్రుగా ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పార్టీలో సమన్వయం కోసం కృషి చేస్తున్నప్పటికి పార్టీలో సెకండ్ క్యాడర్ ఎదగకుండా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యే తీరుపట్ల సుభాష్ రెడ్డి సీఎం కు పిర్యాదు చేశారు.. ప్రతిగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సీఎం ఢిల్లీలో ఉండగా అక్కడికి వెళ్లి సుభాష్ రెడ్డి పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ నియోజక వర్గంలో బీజేపీ పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మెదక్ నియోజక వర్గ ఇన్‌చార్జి గా నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్‌ని బీజేపీ అధిష్టాన వర్గం నియమించింది.

వారం రోజుల్లోనే 2 సార్లు మెదక్ లో గ్రామస్థాయి బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ కార్యకర్తలను ఎంపీ అరవింద్ తన స్పీచ్ తో ఉత్సాహపరుస్తున్నారు. ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్ట్ ను వదులుకొని మరి బీజేపీలో చేరిన నందు జనార్దన్ రెడ్డి పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవాది సుభాష్ గౌడ్ తదితరులు టికెట్ ఆశిస్తున్నారు.

ఇదిలా ఉండగా మెదక్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పై సినీ నటి విజయ శాంతి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె ప్రస్తుతం బీజేపీ లో ఉంది. మళ్ళీ మెదక్ అసెంబ్లీ నుండి పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. సినీ నటిని పోటీకి దింపితే గతంలో ఓడిపోయిన సానుభూతితో పాటు కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండి కొట్టవచ్చు అని బీజేపీ అధిష్టానవర్గం ఆలోచిస్తుందని అంటున్నారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్‌ల‌ గోల కొనసాగుతుంది. డీసీసీ అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన రేవంత్ రెడ్డి వర్గంగా కొనసాగుతున్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచరుడు మెదక్ మున్సిపల్ సభ్యులు మామిళ్ల ఆంజనేయులు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. పిసిసి కార్యదర్శులుగా ఉన్న సుప్రభాత రావు, మ్యాడం బాలకృష్ణ సహితం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ మాజీ మంత్రి దామోదర్ రాజనర్సింహ వర్గంగా కొనసాగుతున్నారు.

నర్సాపూర్: ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి మధ్య..

నర్సాపూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాజీ మంత్రి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి మధ్యలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ముఖ్యంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ బీఆర్ ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, ఆయన సతీమణి రాజమణి మురళి యాదవ్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి మధ్యలో టికెట్ పోరు ఉంటుందని ముందే గ్రహించిన మురళి యాదవ్ పార్టీని వీడారు. ఇదిలా ఉండగా ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ సహితం బలంగా ఉంది. పిసిసిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, తదితరులు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. బీజేపి నుండి మురళి యాదవ్ తో పాటు సింగాయపల్లి గోపి, వీరారెడ్డి ప్రయత్నిస్తున్నారు.

అందోల్: ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ మధ్య వార్

అధికార బీఆర్ ఎస్ పార్టీలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి మధ్య ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ బీజేపీలో మాజీ మంత్రి బాబూమోహన్, మాజీ జెడ్పి చైర్మన్ బాలయ్య మధ్యలో గ్రూప్ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్యనే గట్టి పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జహీరాబాద్: ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు

జహీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాణిక్ రావు ఎంపీ బీబీ పార్టీ మధ్యలో విభేదాలు ఉన్నాయి. పార్టీ అధిష్టాన వర్గం ఈసారి మాణిక్ రావ్‌ను పక్కకు పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇరిగేషన్ శాఖలో ఉన్న ఒక అధికారిని టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయించాలన్న ఆలోచనలో అధిష్టాన వర్గం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు వినబడుతోంది.

కాంగ్రెస్ విషయానికొస్తే మాజీ మంత్రి గీతారెడ్డి ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించి మంత్రిగా గతంలో కొనసాగారు. ఐనప్పటికీ కాంగ్రెస్ లో నరొత్తం, మాజీ ఎంపీ బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి ఒక వర్గంగా కొనసాగుతున్నారు. బీజేపి నుండి గోపి, సుదర్శన్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ కుమార్తె, దామోదర్ రాజనర్సింహ తమ్ముడూ రాంచందర్ నర్సింహ పోటీ పడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్అర్ ఎస్ మధ్యనే పోటీ ఉండనుంది.

పటాన్ చెరువు నియోజక వర్గంలో…

పటాన్ చెరువు నియోజక వర్గంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై పార్టీలో వ్యతిరేకత ఉంది. భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో డజను మంది బీఆర్ ఎస్ నాయకులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ బలపడుతోంది. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపి నుండి అంజి రెడ్డి సహితం టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ లో కాట శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, గాలి అనిల్ కుమార్ పోటీ పడుతున్నారు. ఇక్కడి కాంగ్రెస్ లో గ్రూప్ ల గోల మొదలైంది.

గజ్వేల్‌లో…

సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో బీఆర్ ఎస్ పార్టీ బలంగా ఉంది. ప్రధాన పోటీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుంది. డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కే కాంగ్రెస్ టికెట్ దక్కనుందనీ ప్రచారం జరుగుతుంది. గజ్వేల్ నుండి సీఎం పోటీ చేస్తే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీ నుండి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.

బీఎస్పీ… వైయస్సార్ సిపి, టీడీపీ పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం బీర్ ఎస్, బీజేపి, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అధికార పార్టీలో మాత్రం సిద్దిపేట, గజ్వేల్ మినహా అన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు వర్గపోరు పొంచి ఉంది.

సిద్దిపేట, సంగారెడ్డిలో…

సిద్దిపేటలో బీజేపీ అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి చంద్రం.. లేదా యాదగిరి పోటీలో నిలువనున్నారు. ఐనప్పటికీ హరీష్ రావు గెలుపును ఎవరు ఆపలేరన్నది నియోజకవర్గ ప్రజల మనోగతం. ఇక సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీ పీ సి సి వర్కింగ్ ప్రసిడెంట్ గా కొనసాగుతున్నారు.

2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు చేనేత సహకార సంఘం చైర్మన్ గా ప్రభుత్వం ఇటీవల నియమించింది. బీఆర్ ఎస్ పార్టీ నుండి చింతా ప్రభాకర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి పోటీ పడుతున్నారు.

బీజేపి నుండి విష్ణు వర్ధన్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ ల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అంటున్నారు. పోటీ చేసే అభ్యర్థులను బట్టి ఆయా నియోజక వర్గాల్లో పోటీ ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Exit mobile version