విధాత: నిజామాబాద్ పర్యటనలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ పార్లమెంట్ సమా మొత్తం అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచేలా కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉన్నదా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముందస్తుకు వెళ్తే తాము సిద్ధమన్నారు.
ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి తమిళనాడు, జార్ఖండ్, బీహార్ డిప్యూటీ సీఎం, జేడీయూ జాతీయ అధ్యక్షుడు, అంబేద్కర్ మనవడు సహా తదితరును ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా రాష్ట్రంలో ఎన్నికల కోలాహం మొదలైంది.
అధికార బీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కొంతకాలం కిందట గతంలో వలె ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్తారా? అంటే దానికి కేసీఆర్ అలాంటి ఏమీ లేదని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు.
కానీ ఆయన ముందస్తు లేదంటే ఉన్నట్టే భావించాలని టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ అన్నారు. దీంతో అప్పటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ప్రజాసంగ్రామ యాత్రలోనూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లోనూ ఎన్నికల గురించే నేతలు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరిలో అక్కడ పోలింగ్ జరగనున్నది. నిజానికి తలో 60 సీట్లతో కూడిన ఈ మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలకు ఎప్పుడూ అంతగా ప్రాధాన్యం ఉండదు.
వీటితో పాటు మరో ఆరు రాష్ట్రాలు కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్‌గడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఈ ఏడాది జరుగుతాయి. ఈ మొత్తం రాష్ట్రాల పరిధిలో 119 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. దీంతో వీటిపై ప్రాధాన్యం ఏర్పడ్డాయి. ఈ ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం ఉంటుందని పార్టీ లన్నీ అంచనా వేస్తున్నాయి.
పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అందుకే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేసీఆర్ ఆన్నప్పటికీ రాష్ట్రంలోని వివిధ పార్టీల అధ్యక్షులు, తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్లతో ఫిబ్రవరి లేదా ఏప్రిల్ మధ్యలో ఏమైనా పరిణామాలు చోటు చేసుకోవచ్చని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అందుకే అధికారపార్టీ మొదలు విపక్ష పార్టీలు అభ్యర్థులపై సర్వేలు చేయిస్తున్నాయి. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు, సీట్లు ఆశిస్తున్న అభ్యర్థులు వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. కేటీఆర్ తాజాగా చేసిన ఎన్నికల వ్యాఖ్యలు చూస్తుంటే బీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికల సంకేతంగానే భావించాలనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది.