Site icon vidhaatha

సీపీఐ, సీపీఎం నేత‌ల‌తో మంత్రి జ‌గదీశ్ రెడ్డి సమావేశం

విధాత‌, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో సీపీఐ, సీపీఎం నేత‌ల‌తో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గదీశ్ రెడ్డి స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో మునుగోడు ఉప ఎన్నిక‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై చ‌ర్చించి దిశానిర్దేశం చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్టంలో, దేశంలో ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంపై పోరాటం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తోందని, దర్యాప్తు సంస్థలను కేంద్రం తమ సొంతానికి వాడుకుంటోందని ఆరోపించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితిలో ఉందన్నారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో కలిసి పని చేయడానికి దేశంలోని చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సీపీఎం, సీపీఐ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని మంత్రి తెలిపారు. మునుగోడు నియోజకర్గంలో బీజేపీ పాచికలు వేసి, గెలవాలని చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఓటమి కోసమే టీఆర్ెస్‌కు మద్దతుగా ఉన్నామని చెప్పారు.

ఈ స‌మావేశానికి సీపీఐ, సీపీఎం నేత‌ల‌తో పాటు మాజీ ఎమ్మెల్యే జూల‌కంటి రంగారెడ్డి, ప‌ల్లా వెంక‌ట్ రెడ్డి, ఉజ్జిని యాద‌గిరి రావు, సీపీఎం న‌ల్ల‌గొండ‌, యాదాద్రి జిల్లాల కార్య‌ద‌ర్శులు ముదిరెడ్డి సుధాక‌ర్ రెడ్డి, జ‌హంగీర్, సీపీఐ న‌ల్ల‌గొండ‌, యాదాద్రి జిల్లాల కార్య‌ద‌ర్శులు నెల్లికంటి స‌త్యం, గోదా శ్రీరాములు టీఆర్ఎస్ పార్టీ ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఇంచార్జి, ఎమ్మెల్సీ త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్ రెడ్డి కూడా తదిత‌రులు స‌మావేశంలో పాల్గొన్నారు.

Exit mobile version