NALGONDA l ఎమ్మెల్సీ పదవి ఎవరికో..? అధినేత మదిలో ఉన్నది ఎవరో..??

ఎన్నికలవేళ.. సామాజిక సమీకరణలా !.. ఉద్యమ నేపథ్య‌మా !! MLC post to whom? విధాత: రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలు మూడు మార్చి నెలతో ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈనెల 6న నోటిఫికేషన్(Notification) విడుదల చేసి 13 వరకు నామినేషన్ల స్వీకరించనుంది. దీంతో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ(MLC) స్థానాలను బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎవరితో భర్తీ చేయనున్నారన్న చర్చలు గులాబీ వర్గాల్లో జోరందుకున్నాయి. ఆశావాహులు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు.. పదవీకాలం ముగిసిపోతున్న […]

  • Publish Date - March 5, 2023 / 11:50 AM IST

  • ఎన్నికలవేళ.. సామాజిక సమీకరణలా !.. ఉద్యమ నేపథ్య‌మా !!

MLC post to whom?

విధాత: రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలు మూడు మార్చి నెలతో ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈనెల 6న నోటిఫికేషన్(Notification) విడుదల చేసి 13 వరకు నామినేషన్ల స్వీకరించనుంది. దీంతో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ(MLC) స్థానాలను బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎవరితో భర్తీ చేయనున్నారన్న చర్చలు గులాబీ వర్గాల్లో జోరందుకున్నాయి.

ఆశావాహులు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు..

పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీల్లో వి. గంగాధర్ గౌడ్, కురుమయ్య గారి నవీన్ కుమార్, నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన ఎలిమినేటి కృష్ణారెడ్డి ఉన్నారు. ముఖ్యంగా ఖాళీ స్థానాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణా రెడ్డి స్థానాన్ని ఇదే జిల్లా నుండి భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండగా, ఆ పదవి కోసం ఉమ్మడి జిల్లా నుండి కనీసం పదిమంది బిఆర్ఎస్(BRS) ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కొందరు సీఎం కేసీఆర్‌ను కలిసి, మరికొందరు జిల్లా మంత్రి జి.జగదీష్ రెడ్డి ద్వారా.. ఇలా ఎవరి మార్గాల్లో వారు ఎమ్మెల్సీ పదవి కోసం తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

కాసోజు శంక‌ర‌మ్మ పేరు సైతం..

నల్గొండ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ సీనియర్లు చకిలం అనిల్ కుమార్(Chakilam Anil kumar), చాడ కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ(MLC) రేసులో ఉన్నారు. భువనగిరి నుండి చింతల వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కోరుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్‌లో చేరిన ఆలేరు నియోజకవర్గం నాయకుడు బూడిద బిక్షమయ్య గౌడ్‌తో పాటు అంతకుముందే పార్టీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు, మరో ఛాన్స్ కావాలంటున్న మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, తేరా చిన్నపరెడ్డి, పద్మశాలి కోటాలో రాపోలు ఆనంద భాస్కర్ ఎమ్మెల్సి పదవి ఆశిస్తున్నారు. కోదాడ నుండి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, నకిరేకల్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్లు కూడా వినపడుతున్నాయి. దివంగత శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ పేరు సైతం చర్చకు వచ్చింది.

ఉద్య‌మ నేత‌ల‌తో భ‌ర్తీ చేస్తారా…

ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పదవి కాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ కృష్ణారెడ్డితో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy), స్థానిక సంస్థల కోటాలో ఎం.సి కోటిరెడ్డి, పట్టభద్రుల కోటాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మండలి సభ్యులుగా ఉన్నారు. ఖాళీ కాబోతున్న కృష్ణారెడ్డి స్థానాన్ని ఈ దఫా సామాజిక సమీకరణల నేపథ్యంలో భర్తీ చేస్తారా… లేక పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన సీనియర్లతో, ఉద్యమ నేతలతో భర్తీ చేస్తారా అన్న విషయమై జిల్లా బిఆర్ఎస్ రాజకీయాల్లో విస్తృత చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో యాదవ సామాజిక వర్గానికి సాగర్, కోదాడ నియోజకవర్గాల ఎమ్మెల్యే స్థానాలతో పాటు బడుగుల లింగయ్య యాదవ్ రూపంలో రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు.

నామినేటెడ్ ప‌ద‌వులు సైతం వారి ఖాతాలోనే…

ఎస్సి, ఎస్టీ వర్గాలకు తుంగతుర్తి, నకిరేకల్, దేవరకొండ రిజర్వుడ్ నియోజకవర్గ ప్రాతినిధ్యంతో పాటు పలు నామినేటెడ్ పదవులు కేటాయించారు. రెడ్డి సామాజిక వర్గానికి కూడా మునుగోడు, ఆలేరు, భువనగిరి, హుజూర్‌న‌గర్, సూర్యాపేట, నల్లగొండ ఎమ్మెల్యే స్థానాలతో పాటు పట్టభద్రుల స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి, స్థానిక సంస్థల కోటాలో మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడైన ఎంసీ కోటిరెడ్డికి స్థానం కల్పించారు. ఉమ్మడి జిల్లాలో పలు నామినేటెడ్ పదవులు సైతం వారి ఖాతాలో ఉన్నాయి. మున్నూరు కాపు, పద్మశాలి వర్గాల నుండి గతంలో నేతి విద్యాసాగర్, కర్నే ప్రభాకర్లకు అవకాశం కల్పించారు.

ఎమ్మెల్సీ రేసులో ప‌లువురు…

భువనగిరి నుండి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పార్టీ వదిలి వెళ్ళడంతో ఈద‌ఫా ఎమ్మెల్సీ స్థానం పై బూడిద భిక్షమ‌య్య‌ గౌడ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే అదే ఆలేరు నియోజకవర్గం నుండి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. నకిరేకల్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో పోటీ ఉండకుండా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశమును ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. కోదాడ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు పోటీగా ఉన్న వేనేపల్లి చందర్ రావు కూడా ఎమ్మెల్సీ రేస్ లో ఉన్నారు.

కేసీఆర్ పిలుపుకై ఎదురు చూస్తున్న అనిల్‌కుమార్‌

వీరంతా ఒక ఎత్తయితే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ ఎమ్మెల్సీ ఆశలు మరో ఎత్తుగా బిఆర్ఎస్‌(BRS)లో చర్చనీయాంశమవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుండి ప్రతి ఎన్నికల్లోనూ నల్గొండ సెగ్మెంట్ టికెట్ ఆశిస్తూ అధినేత కేసిఆర్ మాట మేరకు వెనక్కి తగ్గుతూ వస్తున్న చకిలంకు గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో రెబల్‌గానైనా పోటీ చేయాలన్న తన ఆలోచన మానుకొని కంచర్ల గెలుపు కోసం పనిచేసిన అనిల్ కుమార్ అప్పటి నుండి ఎమ్మెల్సీ పదవి కోసం అధినేత కేసీఆర్ పిలుపుకై ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఈసారీ కూడా ఎమ్మెల్సీ స్థానం దక్కకపోతే…

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి చట్టసభల ప్రాతినిధ్యం కోసం అనిల్ కుమార్ 22 ఏళ్లుగా పడిన నిరీక్షణకు ఈసారైనా తెరపడుతుందో లేదో నన్న సంగతి మరో వారం రోజుల్లో తేలిపోనుంది. తండ్రి చకిలం శ్రీనివాసరావు రాజకీయ వారసుడిగా ఆశించిన పదవులు అందుకోలేదన్న నిరాశతో ఉన్న అనిల్ కుమార్ ఈదఫా ఎమ్మెల్సీ స్థానం దక్కకపోతే రాజకీయంగా ఆయన ప్రయాణం మరో మలుపు తీసుకోవడం తద్యం అన్న వాదన అనుచర వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటికే ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అనిల్ కుమార్ ఎమ్మెల్సీ పదవి కోసం అధిష్టానం పై ఒత్తిడి పెంచారు.

జిల్లా రాజ‌కీయాల్లో జోరుగా సాగుతున్న‌చ‌ర్చ‌…

అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections)సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగా పారిశ్రామికవేత్తలను కాకుండా పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగించేలా ఉద్యమకారులను, అలాగే సామాజిక వర్గాలను సంతృప్తి పరిచే రీతిలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయవచ్చు అన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ఉత్కంఠ జిల్లా రాజకీయాల్లో వాడి వేడి చర్చలకు ఆజ్యం పోస్తుంది.

Latest News