Site icon vidhaatha

మోడీ.. జగన్ మధ్యలో బాబు!

విధాత‌: చాన్నాళ్ల తరువాత చంద్రబాబునాయుడు అటు మోదీని, ఇటు జగన్‌ను ఒకేసారి కలవ బోతున్నారు. కలవడం అంటే నేరుగా భేటీ అవుతారా.. జస్ట్ ఓ సదస్సులో ఒకేసారి పాల్గొనడం మాత్రమేనా అన్నది తెలీదు. వాస్తవానికి 2018లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఆ తరువాత మోదీని, బీజేపీని అనరాని మాటలు అన్నారు. మోదీని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు.

మొత్తానికి 2019 ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ బీజేపీని శరణు వేడినా బీజేపీ దరికి రానివ్వలేదు. ఇక జగన్ తో కూడా బాబు గట్టిగానే విభేదించారు. మొన్నటి అసెంబ్లీ వర్షాకాలం సమావేశాల తరువాత మళ్లీ అసెంబ్లీ మొఖం చూసేది లేదని భీష్మ‌ ప్రతిజ్ఞ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు తన ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు అయిన మోడీ, జగన్‌తో కలిసి ఒకే సమావేశంలో పాల్గొంటున్నారు.

గత బడ్జట్ సమావేశాలకూ బాబు అటెండ్ కాలేదు. అంటే ఏడాదిగా చంద్రబాబు.. జగన్ ఎదురు పడలేదు. ఢిల్లీలో డిసెంబర్ 5న మోడీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. అలా ఏపీ నుంచి వైసీపీ, టీడీపీలకు ఆహ్వానాలు అందాయి. ఈ సమావెశం ముఖ్యమైనది. జీ 20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కి వచ్చింది. వచ్చే ఏడాది దేశంలో జీ 20 సదస్సుని నిర్వహించనున్నారు.

ఆ సమావేశం నేపథ్యంలో దేశంలోని విపక్షాల సలహాలూ సూచనలూ తీసుకోవడానికి కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఏపీ నుంచి బాబుకు మాత్రమే ఆహ్వానం అందినట్లుగా టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది. అయితే అప్పటికే వైసీపీకి కూడా ముందే ఆహ్వానం అందింది.

ఇక గతంలో అంటే కొద్ది నెలల ముందు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ముగింపు సందర్భంగా కూడా ప్రధాని అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఆనాడు జగన్‌కి బాబుకీ ఇద్దరికీ ఆహ్వానం లభించింది. కానీ ఆ సభకు వెళ్లలేదు. అయితే ఇపుడు మాత్రం ఆయన హాజరవుతారని అంటున్నారు. ఆ తరువాత చంద్రబాబు మోడీతో భేటీ అవుతారా లేదా.. ఆయన అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు.

Exit mobile version