Site icon vidhaatha

కేబుల్‌ బ్రిడ్జ్‌ కూలిన ప్రదేశాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

విధాత‌: గుజరాత్ మోర్బీలో తీగల వంతెన కూలి 134 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి మంగళవారం పర్యటించారు. సహాయక చర్యలు, క్షతగాత్రులకు చికిత్సపై ముఖ్యమంత్రి సహా అధికారులను అడిగి మోదీ సమాచారం తెలుసుకున్నారు.

గుజరాత్‌లో తీగల వంతెన కూలిన ఘటనపై కేసు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు రాజ్​కోట్ ఐజీ అశోక్​ యాదవ్ తెలిపారు. కాగా.. అరెస్ట్ చేసిన వారిలో వంతెన నిర్వహణ సంస్థ ఒరేవాకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టికెట్ క్లర్క్స్, ఇద్దరు కాంట్రాక్టర్లు, ముగ్గరు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెలికితీత చర్యల్లో పోలీసులు, స్థానికులు సహాయపడ్డారని వివరించారు. ఆదివారం రాత్రి జరిగిన మోర్బీ దుర్ఘటనలో 134 మంది ప్రాణాలు కోల్పోగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొన‌సాగుతున్నాయి.

మరోవైపు సర్దార్ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతిని పురస్కరించుకుని మాట్లాడిన ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. తాను కేవడియాలోనే ఉన్నప్పటికీ తన మనసంతా మోర్బీ బాధితుల గురించే ఆలోచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుండె నిండా భరించలేని బాధ ఉన్నా తప్పక విధులు నిర్వహించాల్సి వస్తోందని భావోద్వేగానికి గురయ్యారు.

గుజరాత్ దుర్ఘటనపై ప్రపంచ దేశాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ప్రార్థించారు. ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగించిందన్న సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Exit mobile version