Site icon vidhaatha

వధూవరుల నెత్తిలో జీలకర్ర, బెల్లం ఎత్తుకెళ్లిన ‘కోతి’

విధాత: తెలంగాణ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో పెళ్లి జరుగుతుంది. వధూవరులు, కుటుంబ సభ్యులు పెండ్లి వేదికపై ఉండగా, పెండ్లికి వచ్చిన బంధువులు, ఆహ్వానితులు మండపంలో ఉన్నారు. వధూవరుల పెళ్లి తంతులో జిలకర బెల్లం తంతు ముగిసింది. మాంగల్య ధారణ ఘట్టం కూడా పూర్తయి వధూవరులు ఉత్సాహంగా తలంబ్రాలు పోసుకుంటున్నారు.

ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక కోతి అకస్మాత్తుగా మెరుపు వేగంతో వివాహ వేదిక పైకి దూసుకొచ్చి క్షణాల్లో వధూవరుల నెత్తిపై ఉన్న జిలకర బెల్లాన్ని తస్కరించి అంతే వేగంతో ఊడాయించింది.

ఈ ఆకస్మిక ఘటనతో కొద్దిసేపు వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ,అతిథులు బిత్తరపాటి గురయ్యారు. ఆ వెంటనే తేరుకొని కోతి గారి కోతి చేష్ట పట్ల వధూవరులతో పాటు అంతా నవ్వుల్లో మునిగితేలారు. వధూవరుల తరఫువారైతే ఆంజనేయుడే వధూవరుల నెత్తిపై చేయి పెట్టి ఆశీర్వదించి నట్లుగా సంతోషపడ్డారు.

అయితే ఈ వీడియో ఏడాది క్రితందైనప్పటికీ గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నది. మీరు ఓ లుక్కేయండి మరి.

Exit mobile version