విధాత: అధికార బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్న జాబితా పెద్దగానే ఉన్నది. ప్రస్తుతానికి ఐదు ఎమ్మెల్సీ ఖాళీల్లోని ఎమ్మెల్యేల కోటాలో అభ్యర్థులుగా కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వారు ఈ నెల 9న నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 13న ఆ ఎన్నిక జరగనున్నది. ఇక గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 స్థానాల్లో ఎవరికి ఛాన్స్ దక్కబోతున్నదనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతున్నది.
అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా సీఎం ఈసారి ఇద్దరికి అవకాశం కల్పించబోతున్నారని సమాచారం. ప్రాధాన్యాల వారీగా సొంతపార్టీ నేతలకు, వివిధ పార్టీల నుంచి వచ్చిన అనేకమంది సీనియర్ నేతలకు సీఎం కేసీఆర్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అవి నెరవేరలేదు.అందుకే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి వాళ్లు పార్టీ వీడారు. ఆయనతో పాటు మరికొందరు ఆయన బాటనే ఎంచుకున్నారు.
గవర్నర్ కోటాలో ఎంపికయ్యే ఇద్దరు అభ్యర్థుల పేర్లను రాష్ట్ర క్యాబినెట్ సిఫార్సు చేసి గవర్నర్ ఆమోదానికి పంపుతుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటలను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించారు. అయితే క్యాబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ ఆమోదం తెలుపలేదు. దీంతో చాలారోజులు కౌశిక్ ఎదురుచూడటం మినహా ఏం చేయలేకపోయారు.
రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నవివాదం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపుతున్న బిల్లులు, క్యాబినెట్ సిపార్సులు ఆమోదానికి నోచుకోవడం లేదు. దీంతో ఈసారి గవర్నర్ కోటాలో ఎంపిక చేసే అభ్యర్థులపై గులాబీ బాస్ పెద్ద కసరత్తే చేశారట. రాష్ట్రంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ లాంటి నేతలకు చెక్ పెట్టడమే కాకుండా దళితబంధు లాంటి పథకం ద్వారా ఆ వర్గాల ఓట్లను తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంటున్న కేసీఆర్ ఈసారి మోత్కుపల్లి నర్సింహులుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించబోతున్నట్టు సమాచారం.
సామాజిక సమీకరణాల దృష్ట్యా మండలిలో మాల సామాజిక వర్గం నుంచి ఇప్పటికే గోరటి వెంకన్నకు అవకాశం ఇచ్చారు. ఈసారి మండలి సీటు కోసం చాలామంది పోటీలో ఉన్నప్పటికీ మాదిగ సామాజిక వర్గం నుంచి మోత్కుపల్లిని ఎంపిక చేయాలని ఇప్పటికే కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మరో సీటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్ రావు లేదా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిల పేర్లు ప్రచారంలో వినిపిస్తున్నాయి.