సార్.. రూట్ మార్చారు: కోమటిరెడ్డి అనుచరుల్లో మళ్లీ డైలమా!

విధాత: మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా మారిపోవడం కాంగ్రెస్ కేడర్‌కు ఊరటనిచ్చినప్పటికీ, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం ఆయన అనుచరులను మళ్లీ డైలమా లో పడేసింది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోవడం.. మునుగోడు ఉప ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి పరోక్షంగా ఆయనకు మద్దతు తెలపడం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో విభేదాలు, అటు ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీల నేపథ్యంలో వెంకట్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తారని నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆయన అనుచరులు […]

  • Publish Date - January 22, 2023 / 05:39 PM IST

విధాత: మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా మారిపోవడం కాంగ్రెస్ కేడర్‌కు ఊరటనిచ్చినప్పటికీ, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం ఆయన అనుచరులను మళ్లీ డైలమా లో పడేసింది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోవడం.. మునుగోడు ఉప ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి పరోక్షంగా ఆయనకు మద్దతు తెలపడం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో విభేదాలు, అటు ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీల నేపథ్యంలో వెంకట్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తారని నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆయన అనుచరులు గట్టిగా నమ్మారు.

దీంతో నియోజకవర్గంలోని నల్గొండ రూరల్, మున్సిపాలిటీ, కనగల్, తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల్లోని ఆయన అనుచర వర్గం, అంతకుముందు బీఆర్‌ఎస్‌లో చేరిన వారు వెంకట్‌రెడ్డితో పాటు బీజేపీలోకి వెళ్లేందుకు తెర వెనక సన్నాహాలు చేసుకున్నారు. ఇంతలోనే వెంకట్‌రెడ్డి అనూహ్యంగా రేవంత్ రెడ్డితో విభేదాలను పక్కనపెట్టి గాంధీ భవన్‌కి వెళ్లి ఆయనతో భేటీయై మళ్లీ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా మారి పోయిన తీరు నియోజకవర్గంలోని ఆయన అనుచర వర్గాలను ఖంగు తినిపించింది.

సార్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక, రాజకీయంగా ఆయనతోపాటు అటు ఆయ‌న కేడ‌ర్ కూడా గందరగోళంలో ప‌డి ఎటూ అడుగులు వేయలేక, సొంత గ్రామాల్లో పలుచనయ్యే పరిస్థితి ఏర్ప‌డి దంటూ అనుచరులు గుర్రుమంటున్నారు. వెంకట్‌రెడ్డి నిలకడలేమి రాజకీయ నిర్ణయాలు తమను గందరగోళ పరుస్తున్నాయంటూ వాపోతున్నారు.

రాజకీయంగా తాను వేయబోయే అడుగులపై, తీసుకునే నిర్ణయాలపైన తన కోటరీ వర్గీయులకే కాకుండా గ్రామస్థాయిలో ఉండే వారికి కూడా ముందస్తు సమాచారం ఇస్తే బాగుంటుందని, అలా కాకుండా తన ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటూ పోతే గ్రామాల్లో తమ పరిస్థితిని పరిగణలోకి తీసుకోకపోవడం వారికి మింగుడు పడనిదిగా మారింది.

మరోవైపు వెంకట్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో క్రియాశీలకం అవ్వడం, నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇదే నియోజకవర్గంలో నుంచి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న దుబ్బాక నరసింహారెడ్డి భవిష్యత్ మరోసారి చిక్కుల్లో పడినట్లయినది. ఏది ఏమైనా వెంకట్ రెడ్డి అనిశ్చిత రాజకీయ నిర్ణయాలు, తప్పటడుగులు తమ రాజకీయ భవిష్యత్తుకు సంకటంగా, గందరగోళంగా మారుతున్నాయంటూ అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.