విధాత : చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణంలో ఒక ఒంటరి ఏనుగు ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గంగవరం హైవే వద్ద హల్ చల్ చేస్తున్న ఈ ఏనుగును ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ అడవిలోకి మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా రెచ్చిపోయిన ఏనుగు సుకుమార్ పై దాడికి పాల్పడింది. ఏనుగు దాడి నుంచి తప్పించుకునే తొందరలో సుకుమార్ రోడ్డుపై పడిపోగా..ఏనుగు ఆయనను కాలుతో తొక్కి..తొండంతో కొట్టి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు, అటవీ సిబ్బంది తీవ్ర గాయాలపాలైన సుకుమార్ ను వెంటనే పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఏనుగు సంచారంతో గంగవరం ప్రజలు, రైతులు భయపడుతున్నారు. చెరుకు, పండ్ల తోటలు, పంట పొలాల్లో సంచరిస్తూ వాటిని ధ్వంసం చేస్తుంది. గతంలో ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపులు పంటపొలాలను ధ్వంసం చేశాయని స్థానికులు చెబుతున్నారు. ఏనుగు విధ్వంసంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు దానిని తిరిగి అడవిలోకి పంపడానికి ప్రయత్నాలు చేపట్టారు.