- తెలంగాణలో సర్పంచులకు ప్రాధాన్యత లేదు
- LED లైట్లు, ట్రాక్టర్లు, బ్లీచింగ్ ఫౌడర్ కొనుగోలులో ఎమ్మెల్యే సైదిరెడ్డి భారీ అవినీతి
విధాత, నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు గౌరవం దక్కడం లేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు సరైన నిధులు విధులు లేక అడుగడుగునా అవమానాలు భరిస్తూ గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అధికార, ప్రతి పక్ష సర్పంచుల రక్తాన్ని పీలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్లె ప్రగతిలో చేసిన పనులకు నెలల తరబడి బిల్లులు రాక లక్షలాది రూపాయల పెండింగ్ బిల్లులతో సర్పంచులు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని, తెచ్చిన డబ్బులకు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని ఆరోపించారు.. సర్పంచులను, స్థానిక ప్రజాప్రతినిధులను అవమానిస్తున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలి పోవడం ఖాయమన్నారు.
హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్‌ల తీర్మానం లేకుండానే ఎల్ఈడీ లైట్లు, ట్రాక్టర్లు, చివరికి బ్లీచింగ్ ఫౌడర్ కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొంత మంది మండల అభివృద్ధి అధికారులు బ్లీచింగ్ ఫౌడర్లు కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు సరఫరా చేస్తున్నారని వారు గ్రామ పంచాయతీకి సరఫరా చేసే అవసరం ఏమిటని ప్రశ్నించారు.
జిల్లా పరిషత్ సమావేశంలో అంతా బేష్ అని అధికారులు క్లీన్ చిట్ ఇస్తున్నారని, క్షేత్ర స్థాయిలో సర్పంచ్ లను అడిగితే సమస్యల చిట్ట చెబుతున్నారని అన్నారు.. సర్పంచులకు రావాల్సిన పల్లె ప్రగతి బిల్లులు జడ్పీ సమావేశంలో తాను ప్రశ్నించడం వలనే కొంత నిధులు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
హుజూర్ నగర్ మండలం గోపాలపురం సర్పంచ్‌కు తెలియకుండా తీర్మానం లేకుండా ముఖ్యమంత్రి ప్రతి గ్రామానికి ఇచ్చిన యస్.డి. యఫ్ నిధులు రూ.20 లక్షల పనులను అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే సైదిరెడ్డి అండ దండలతో దొడ్డి దారిన పనులు చేపట్టారని ఆరోపించారు. పంచాయతీ తీర్మానం ఇవ్వకుంటే అధికారులతో బెదిరింపులు కు పాల్పడి గ్రామ పంచాయితీ రికార్డుల్ని జిల్లా అధికారులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్డీఎఫ్ నిధులకు ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఏమి సంబంధం అని ప్రశ్నించారు.
సర్పంచులకు ఏ కష్టం వచ్చిన సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఉత్తమన్న మీ వెంటే ఉంటాడని భరోసా ఇచ్చారు. నడిగూడెం మండల కరివిరాలలో ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డిలు కలిసి కాంగ్రెస్ మహిళ సర్పంచ్ పై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారని దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నానన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్నట్లుగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని గ్రామాల్లో 12 గంటలు కూడా కరెంటు రావడం లేదన్నారు. కొన్నిచోట్ల గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మించారని వాటికి బిల్లులు చెల్లించక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతే కాకుండా వైకుంఠ దామాలలో మీటర్లు పెట్టారని ఒక్క బల్పు , ఒక్క ఫ్యాన్ లేకపోయిన 1500 రూపాయల వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయని గ్రామ పంచాయతీలు ఆ బిల్లులు చెల్లించలేని స్థితి లో ఉన్నాయని ప్రభుత్వమే ఆ బిల్లులు చెల్లించాలని అన్నారు.
ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన పనులకు ఎంబీలు చేసి నెలలు గడిచిన బిల్లులు రాలేదని లక్షల రూపాయలు పెండింగ్ లో ఉండటంతో అప్పులు పాలవుతున్నారని సర్పంచులు తమ బాధలు చెప్పుకున్నారు. దళిత బంధును, ఆసరా పెన్షన్లు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను కమిషన్లు కోసం కాకుండా గ్రామసభల ద్వారా తీర్మానం చేసి ఎంపిక చేయాలని అన్నారు.
చిల్లర రాజకీయాలు , దోపిడీలు చేసే వారు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండరని అన్నారు. ఎమ్మెల్యే సైది రెడ్డి OTM (one time mla) మాత్రమే అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇక ఆరు నెలలు మాత్రమేనని ఈ అవినీతి ఎమ్మెల్యేలు ఎటు పోతారో చూద్దామన్నారు. యస్టిఓలు,సంబంధిత అధికారులు సర్పంచుల దగ్గర కమీషన్లు తీసుకోవడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లిఖార్జునరావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశముఖ్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, ఎంపీపీ గోపాల్, జడ్పీటీసీ మోతీలాల్, మంజునాయక్, కోనతం చిన్న వెంకటరెడ్డి, అంజన్ రెడ్డి, గోవిందా రెడ్డి, కొట్టే సైదేశ్వరరావు, బచ్చల కూరి బాబు, కుక్కడపు మహేష్, ముక్కంటి, కృష్ణ, రాము, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు