కాంగ్రెస్‌లో వివేక్ చేరిక లాంఛ‌నమే! ఆయ‌న‌కు ఎంపీ.. కొడుకుకు చెన్నూర్‌?

రాహుల్‌గాంధీని కలిసిన అనంతం వివేక్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌ని తెలుస్తున్న‌ది.

  • Publish Date - October 30, 2023 / 12:45 PM IST

విధాత: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మరోసారి కాంగ్రెస్‌లో చేరబోతున్నార‌ని విశ్వ‌స‌నీయంగా తెలిసింది. బీజేపీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఉన్న వివేక్ కాంగ్రెస్‌లో చేరేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ముందుగా రాహుల్‌గాంధీని కలిసిన అనంతం వివేక్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌ని తెలుస్తున్న‌ది.


టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం వివేక్ ఫాంహౌజ్‌కు వెళ్లి ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించార‌ని స‌మాచారం. లెఫ్ట్ నేత‌లు కోరుతున్న చెన్నూరు సీటును.. వివేక్ చేరిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ పెండింగ్‌లో పెట్టింద‌ని చెబుతున్నారు. తొలుత పొత్తులో భాగంగా సీపీఐకి చెన్నూరు టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. వివేక్ తన కుమారుడికి చెన్నూరు సీటు కావాలని కోరడంతో సీపీఐకి ఈ సీటు ఇవ్వలేమని తేల్చేసింది. తన కొడుకు కోసం కోరిన చెన్నూరు టికెట్‌తో పాటు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వివేక్ కోరుతున్న పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించిందని, అందుకే వివేక్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తున్న‌ది.


వివేక్ సోదరుడు వినోద్‌కు ఇప్పటికే బెల్లంపల్లి టికెట్‌ను కాంగ్రెస్ కేటాయించింది. అటు బీజేపీ సైతం వివేక్‌కు తమ తొలి జాబితాలో చెన్నూరు టికెట్‌ను కేటాయించింది. ఐనప్పటికీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోరుగా మారిపోవడం, బీజేపీ పోటీ నామ‌మాత్ర‌మేన‌ని స‌ర్వేలు పేర్కొంటున్న నేప‌థ్యంలో వివేక్ కాంగ్రెస్‌కే మొగ్గు చూపార‌ని ఆయ‌న స‌న్నిహిత‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.



కండువాల మార్పులో వివేక్ స్పీడ్‌

దివంగత కాంగ్రెస్ దిగ్గజం జీ వెంకటస్వామి కుమారుడిగా రాజకీయాల్లో వచ్చిన మాజీ వివేక్ 2009, 2014 ఎన్నికల్లో పెద్దపల్లి రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ ఉధృతిలో 2013 జూన్ 2న గులాబీ గూటికి చేరారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తిరిగి 2014 మార్చి 31న కాంగెస్ చేరి, పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2016లో తిరిగి బీఆరెస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహ‌రించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ నిరాకరించడంతో ఇదే ఏడాది మార్చి 25న ఆ పార్టీకి రాజీనామా చేసి, ఆగస్టు 9న బీజేపీలో చేరారు. తాజాగా ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నారు.