విధాత: యూపీ మాజీ సీఎం, ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆయన పూర్వీకుల గ్రామమైన ఇటావాలోని సైఫాయిలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు.
ములాయం అంత్యక్రియలు అధికారికంగా జరపనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ములాయం గౌరవార్థం ప్రభుత్వం మూడురోజులు సంతాపదినాలు ప్రకటించింది. సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు ములాయం అంత్యక్రియల్లో పాల్గొననున్నారు
ఉత్తరర్‌పదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీకి మంగళవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ చేరుకొంటారు. అక్కడ ములాయం పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. సీఎం కేసీఆర్ వెంట పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా వెళ్తున్నారు.
82 ఏండ్ల ములాయం గుర్‌గ్రావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.